Delta Air Lines: బ్రా ధరించలేదని విమానం నుంచి దించేస్తామన్నారు.. డెల్టా ఎయిర్‌లైన్స్‌పై విరుచుకుపడిన మహిళ

 Woman Claims She Was Scolded By Delta Flight Official For Not Wearing A Bra
  • జనవరిలో జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి
  • సాల్ట్‌లేక్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తుండగా ఘటన
  • టీ షర్ట్‌పై జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామన్న విమాన సిబ్బంది
  • తన ఎద యుద్ధంలో వాడే ఆయుధం కాదన్న బాధిత మహిళ
  • ఎయిర్‌లైన్ సంస్థకు నోటీసులు
  • ఇప్పటికే క్షమాపణలు చెప్పిన డెల్టా ఎయిర్‌లైన్స్
బ్రా ధరించని కారణంగా తనను విమానం నుంచి దించేస్తామని బెదిరించారంటూ అమెరికా మహిళ ఒకరు డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది వివక్ష తప్ప మరోటి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడీ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె పేరు లిసా ఆర్చ్‌బోల్డ్ (38). బ్యాగీ జీన్స్, వదులుగా ఉన్న వైట్ టీషర్ట్‌తో బ్రా ధరించకుండానే ఫ్లైట్ ఎక్కారు. తన ఎద బయటకు కనిపించనప్పటికీ కవర్ చేసుకోవాలని మహిళా సిబ్బంది కోరారని పేర్కొన్నారు. జనవరిలో ఈ ఘటన గురించి తాజాగా లాస్ ఏంజెలెస్‌లో విలేకరులకు వెల్లడించారు. ఫ్లైట్ సిబ్బంది అలా చెప్పడం తనకు తీవ్ర అవమానంగా అనిపించిందని వాపోయారు. తాను స్త్రీని కానని భావించి తనను లక్ష్యంగా చేసుకుని వారలా ప్రవర్తించినట్టు తనకు అనిపించిందని ఆమె పేర్కొన్నారు. 

డీజే అయిన ఆర్చ్‌బోల్డ్ సాల్ట్ లేక్ సిటీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తన వస్త్రధారణ ‘బహిర్గతం’, ‘ఆక్షేపణీయం’గా ఉందని, కాబట్టి అనుమతించబోమని డెల్టా సిబ్బంది తనకు చెప్పారని వివరించారు. టీ షర్ట్‌పై జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పారని తెలిపారు.  ఈ వివక్షాపూరిత విధానంపై చర్చించేందుకు కంపెనీ ప్రెసిడెంట్‌తో సమావేశం కావాలని డిమాండ్ చేస్తూ ఆర్చ్‌బోల్డ్ తరపున డెల్టా ఎయిర్‌లైన్స్‌కు లేఖ రాసినట్టు న్యాయవాది గ్లోరియా ఆల్రెడ్ తెలిపారు.

పురుషులు తమ టీ షర్టులను జాకెట్ల‌తో ఎలా అయితే కప్పుకోరో, మహిళలకు కూడా అలాంటి అవసరం లేదని ఆమె వాదించారు. భద్రతాపరమైన ముప్పు ఉంటే తప్ప ప్రయాణికులను విమానం నుంచి దించకూడదని అమెరికా చట్టాలు చెబుతున్నాయని ఆల్రెడ్ తెలిపారు. రొమ్ములు యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు కావని, వారు అవి కలిగి ఉండడం నేరం కాదని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పినట్టు తెలిసింది.
Delta Air Lines
Lisa Archbold
Scarlet
Los Angeles
Salt Lake
San Francisco

More Telugu News