Arvind Kejriwal Arrest: ఈసారి ఐక్యరాజ్య సమితి.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన యూఎన్

  • ఎన్నికలు జరిగే ఇండియా లాంటి దేశాల్లో ప్రజల ‘రాజకీయ, పౌర హక్కులు’ రక్షించబడతాయని యూఎన్ ఆశాభావం
  • ‘స్వేచ్ఛగా, న్యాయంగా’ ఓటు వేసే వాతావరణం ఉంటుందని విశ్వాసం
  • ఇలాంటి వ్యాఖ్యలే చేసిన అమెరికాపై భారత్ ఆగ్రహం
UN responds on Delhi CM Arvind Kejriwal arrest

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే అమెరికా స్పందించగా, తాజాగా ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఎన్నికలు జరిగే ఇండియా సహా ఇతర దేశాల్లో ప్రజల ‘రాజకీయ, పౌర హక్కులు’ రక్షించబడతాయని బలమైన విశ్వాసాన్ని కనబరుస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్ అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ‘స్వేచ్ఛగా, న్యాయంగా’ ఓటు వేసే వాతావరణం ఉంటుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభనతో లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత్‌లో నెలకొన్న ‘రాజకీయ అశాంతి’పై అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. 

ఇవే విషయాలపై అమెరికా కూడా ఇలాగే స్పందించడం గమనార్హం. అమెరికా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత్.. తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఘాటుగా హెచ్చరించింది. అంతేకాదు, అమెరికా వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ దేశ రాయబారికి సమన్లు కూడా ఇచ్చింది. మరి ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యలపై భారత్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.

More Telugu News