K Kavitha: కోర్టు ఆదేశించినా... తీహార్ జైలు అధికారులు పట్టించుకోవడం లేదు: కోర్టులో కవిత పిటిషన్

  • మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు తనకు ఉన్నాయన్న కవిత
  • రక్తపోటు సమస్య అధికంగా ఉందని... అందుకే తన విజ్ఞప్తితో కోర్టు తనకు కొన్ని వెసులుబాట్లు కల్పించిందని వెల్లడి
  • ఈ మేరకు జైలు అధికారులకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్న కవిత
  • కోర్టు ఆదేశాలను పాటించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్న కవిత
Kavitha petition in CBI court over tihar jail officials

తనకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ తీహార్ జైలు అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు తనకు ఉన్నాయని, రక్తపోటు సమస్య అధికంగా ఉందని... అందుకే తన విజ్ఞప్తి కారణంగా కోర్టు తనకు కొన్ని వెసులుబాట్లు కల్పించిందన్నారు. ఈ మేరకు జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చిందన్నారు.

తనకు ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. పరుపులు ఏర్పాటు చేయలేదని, చెప్పులు కూడా అనుమతించడం లేదన్నారు. బట్టలు, బెడ్ షీట్స్, బుక్స్, బ్లాంకెట్స్‌ను అనుమతించడం లేదని తెలిపారు. పెన్ను, పేపర్లను అందుబాటులో ఉంచడం లేదని, కనీసం కళ్ళజోడును కూడా అనుమతించడం లేదన్నారు. చేతికి వున్న జపమాలను కూడా అనుమతించలేదని ఆరోపించారు.

జైలు అధికారుల తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. తనకు వెసులుబాట్లు కల్పించేలా తీహార్ జైలు సూపరింటిండెంట్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం... శనివారం విచారణ జరుపుతామని తెలిపింది.

More Telugu News