YS Jagan: ఈసారి డబుల్ సెంచరీ విజయాన్ని అందించేందుకు మీరంతా సిద్ధమేనా?: నంద్యాలలో సీఎం జగన్

CM Jagan asks people do you ready to bring double century govt
  • నంద్యాలలో మేమంతా సిద్ధం సభ
  • నంద్యాల జనసముద్రాన్ని తలపిస్తోందన్న సీఎం జగన్
  • సంక్షేమ రాజ్యాన్ని కూలగొట్టేందుకు అన్ని పార్టీలు కూటమిగా వస్తున్నాయని వెల్లడి
  • నారావారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధం అని స్పష్టీకరణ
ఏపీ సీఎం జగన్ నంద్యాలలో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. నంద్యాలలో ఇవాళ జన సముద్రం కనిపిస్తోందని అన్నారు. మీ బిడ్డ జగన్ ఒంటరివాడు... సంక్షేమ రాజ్యాన్ని కూలగొట్టేందుకు అన్ని పార్టీలు కూటమిగా వస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. 

"పేదవాడి బతుకును చీకటి నుంచి వెలుగుకు తీసుకుపోతుంటే, మాయలమారి పార్టీలన్నీ కుట్రలు చేస్తున్నాయి. ఆ కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా  సిద్ధమేనా అని అడుగుతున్నాను. మరోసారి ఫ్యానుకు రెండు ఓట్లు వేసి, ఇతరులతోనూ వేయించి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 లోక్ సభ స్థానాలు... మొత్తమ్మీద 200కి 200 స్థానాల్లో గెలిపించి డబుల్ సెంచరీ ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీరంతా సిద్ధమేనా? అని అడుగుతున్నా. 

మళ్లీ నారా పాలన తెస్తామంటున్నారు. నరకాసురుడు, రావణుడు, ధుర్యోధనుడు కలిశారు. సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి. ఇటు జగన్ ఒక్కడే... అటు చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ వాళ్లు ఏకమయ్యారు. వీరికి కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియా కూడా వారికే వత్తాసు పలుకుతోంది. వారిని అడ్డుకునేందుకు ప్రజలంతా సిద్ధమేనా? 

ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు... ఇప్పటివరకు జరిగిన ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదేళ్లకు కూడా కొనసాగించే ఎన్నికలు ఇవి. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి వెళుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. అందుకే ఈ ఎన్నికల్లో జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నా. 

ఇంట్లో ఉన్న మీ అక్కచెల్లెమ్మలతో, మీ అవ్వా తాతలతో కూర్చుని ఆలోచన చేయండి. మీకు ఎవరి పాలనతో మంచి జరిగిందో, మీ ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోండి. ఈ ఎన్నికలు మన పార్టీకి ఓ జైత్రయాత్ర అయితే, మోసాల బాబుకు ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి. 

మీ బిడ్డ జగన్ ఎంత అభివృద్ధి చేశాడో మీ కళ్ల ఎదుటే కనిపిస్తోంది. 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఎక్కడా లేని విధంగా వాలంటీరు వ్యవస్థను తీసుకువచ్చాం. ఒకటో తేదీనే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నాం. అవినీతి రహిత, వివక్ష రహిత పాలన అందిస్తున్నాం. 

నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువులు అందుబాటులోకి తీసుకువచ్చాం. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, కాపు నేస్తం, జగనన్న తోడు, నేతన్న నేస్తం, ఆసరా, మత్స్యకార చేయూత... ఇలా మునుపెన్నడూ లేనంత సంక్షేమం అందిస్తున్నాం" అని సీఎం జగన్ వివరించారు.
YS Jagan
Double Century
Memantha Siddham
Nandyala
YSRCP
Andhra Pradesh

More Telugu News