Election Commission: రెండవ దశ లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

  • ప్రారంభమైన నామినేషన్ల పర్వం.. ఏప్రిల్ 4న ముగింపు
  • ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన
  • 12 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని 88 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్
Election Commission issued the notification for the second phase of the parliamentary polls psnr

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా రెండవ దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి తరపున కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాల దాఖలుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా ఉంది. జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్‌లో పరిశీలన జరగనుందని నోటిఫికేషన్‌లో ఎన్నికల సంఘం పేర్కొంది. 

రెండవ విడతలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొదటి దశలో భాగంగా మార్చి 20న నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ‘ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం’లోని కొంత భాగంలో రెండో దశలో కూడా పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని 15 అసెంబ్లీ స్థానల్లో ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుండగా.. మిగతా 13 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.

ఏయే రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలకు?
కేరళలో 20 స్థానాలు, కర్ణాటక-14, రాజస్థాన్‌-13, మహారాష్ట్ర-8, ఉత్తరప్రదేశ్-08, మధ్యప్రదేశ్‌-7, అసోం - 5, బీహార్-5, 
ఛత్తీస్‌గఢ్- 3, పశ్చిమ బెంగాల్-3, మణిపూర్-1, త్రిపుర-1, జమ్మూ కాశ్మీర్-1 నియోజవకర్గాల్లో మొదటి దశ పోలింగ్ జరగనుంది.

More Telugu News