YS Jagan: విశాఖ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్

CM Jagan opines on Visakha Drugs Container issue for the first time

  • ప్రొద్దుటూరులో 'మేమంతా సిద్ధం' సభ
  • ఎన్నికల ప్రచారం షురూ చేసిన సీఎం జగన్
  • చంద్రబాబు వదిన గారి చుట్టం అంటూ కంటైనర్ వ్యవహారంలో ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇటీవల విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. 

"చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ పేరుతో డ్రగ్స్ ను పెద్దమొత్తంలో దిగుమతి చేస్తుంటే సీబీఐ వాళ్లు దాడి చేశారు. ఈ రెయిడ్ జరిగిందని తెలియగానే ఎల్లో బ్రదర్స్ అందరూ ఉలిక్కిపడ్డారు. దొరికింది వాళ్ల బ్రదరే అయినా, అతడు దొరికిపోయాడు కాబట్టి అతడిని మన (వైసీపీ) వాడు అని దుష్ప్రచారం చేస్తున్నారు. 

తీరా చూస్తే వారు ఎవరయ్యా అంటే... సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, చంద్రబాబు వదిన గారి కొడుకు, వియ్యంకుడు ఆ కంపెనీలో గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు. బాబు అక్కడ నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు ఇంకా బాగా దగ్గరి బంధుత్వం ఉంది. 

నేరమంటూ జరిగితే చేసింది వారు... కానీ తోసింది మన మీద.  నేరం ఎక్కడైనా జరగనివ్వండి, ఎక్కడ ఏం జరిగినా మన మీద బురద చల్లడానికి ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు వెంటనే రెడీ అయిపోతారు. వీళ్లిద్దరికీ ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 తోడవుతాయి. వీళ్లందరూ ఓ ఎల్లో బ్యాచ్ గా తయారై నేరాన్ని మనకు ఆపాదిస్తారు. 

గత 45 ఏళ్లుగా చంద్రబాబు నడిపిస్తున్న క్షుద్ర రాజకీయాలను చూస్తూనే ఉన్నాం. దొరకని వాళ్లంతా టీడీపీ వాళ్లు... దొరికితే మాత్రం వైసీపీ వాళ్లు అంటారు. బతికున్నప్పుడు వివేకా గారిని శత్రువులా చూశారు. చనిపోయాక మాత్రం శవరాజకీయాలు, కుట్రలు చేస్తున్నారు. బతికున్న ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంపేస్తారు. చనిపోయాక వీళ్లే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని, విగ్రహాలు ఊరూరా పెట్టి, దండలు వేసి దణ్ణాలు పెడుతున్నారు. వీళ్ల నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయో చూడండి.  

ఇలాంటి రాజకీయాలు చూస్తుంటే ఛీ అనిపిస్తుంది. మనల్ని తిట్టేవాళ్లు ఏమంటున్నారో కూడా తెలుసుకోవాలి కదా... అందుకే ఈనాడు పేపర్ చూస్తాను. పొద్దునే లేచి ఈనాడు పేపర్ చూస్తే ఛీ ఇదొక పేపరా అని రోజూ పక్కన పడేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 

ఈ చంద్రబాబు, ఈ దత్తపుత్రుడు, వీళ్లు కేంద్రం నుంచి ఒక పార్టీని ప్రత్యక్షంగా మద్దతు తెచ్చుకున్నారు, పరోక్షంగా మరో పార్టీని మద్దతు తెచ్చుకున్నారు. వీళ్లందరూ కూడా ఒక్క జగన్ మీద! ఇంతమంది ఏకమై ఒక్క జగన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్... వీళ్లంతా సరిపోవడంలేదని నా చెల్లెళ్లు ఇద్దరినీ కూడా తెచ్చుకున్నారు. 

నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తున్నది ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపెట్టాడు అంటే, ఈ ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికీ లేదంటే అందుకు కారణం... ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడి దయ, ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక సత్యం" అంటూ సీఎం జగన్ భావోద్వేగభరితంగా ప్రసంగించారు. 

  • Loading...

More Telugu News