Deepak Reddy: జగన్ రికార్డు స్థాయిలో మాట తప్పి మడమ తిప్పారు: మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి

  • జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న దీపక్ రెడ్డి
  • 85 శాతం హామీలు పూర్తి చేయలేదని ఆరోపణ
  • ఎన్నికల ముందు ముద్దులు, ఇప్పుడు గుద్దులు అంటూ వ్యాఖ్యలు 
Ex MLC Deepak Reddy take a dig at CM Jagan over poll assurances

సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ జి. దీపక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ రికార్డు స్థాయిలో మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. జగన్ ఇచ్చిన 730 హామీల్లో 621 హామీలు అంటే 85 శాతం పూర్తి చేయలేదని అన్నారు.

"నేను ఉన్నాను, విన్నాను అంటూ గతంలో ఎన్నికల ముందు ప్రచారం చేశారు. 5 ఏళ్ల వరకు జగన్ రెడ్డికి వినపడలేదు, కనపడలేదు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పి మాట తప్పి, మడమ తిప్పడంలో సరిలేరు జగన్ కు సాటి అనే విధంగా 5 ఏళ్ల పాలన సాగించారు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టుకుంటూ తిరిగి ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారు. మ్యానిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పి ఒక్క హామీని నెరవేర్చలేదు" అని దీపక్ రెడ్డి విమర్శించారు. 

శాండ్, లాండ్, వైన్, మైన్ లను దోపిడి చేసి రూ.8,23,600 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ 5 ఏళ్లల్లో రూ.11,52,000 వేల కోట్లు అప్పు చేశారని తెలిపారు. ధరలు, పన్నులు, ఛార్జీలు పెంచి ఒక్కో కుటుంబం పై రూ.8లక్షల భారం మోపారని దీపక్ రెడ్డి మండిపడ్డారు. కోర్టు కేసుల కోసం వేల కోట్లు వృథా చేశారని ఆరోపించారు.

రెడ్డి సామాజిక వర్గానికి వైసీపీ 49 మంది అభ్యర్ధులకు సీట్లు ఇవ్వడమేనా సామాజిక న్యాయం? ఇటువంటి వ్యక్తికి ఓటు వేయాలా? అని ప్రజలు ఒకసారి ప్రశ్నించుకోవాలని పిలుపునిచ్చారు.

More Telugu News