Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా వ్యాఖ్యలు... భారత్ తీవ్ర అభ్యంతరం.. అమెరికా దౌత్యవేత్తకు సమన్లు

  • విదేశాంగ కార్యాలయానికి వచ్చిన అమెరికా రాయబార కార్యాలయ అధికారి
  • తోటి ప్రజాస్వామ్య దేశాల విషయంలో బాధ్యతతో ఉండాలని లేదంటే సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిక
  • భారత న్యాయ ప్రక్రియలు స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయన్న విదేశాంగ శాఖ
Arvind Kejriwal ED Arrest Case and MEA strongly objects to US remarks

కేజ్రీవాల్ అరెస్ట్ ఘటనపై స్పందించిన అమెరికా పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారంలో మొదట జర్మనీ, ఆ తర్వాత అమెరికా స్పందించాయి. భారత్‌లో ప్రతిపక్ష నేత అరెస్ట్‌కు సంబంధించిన నివేదికను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శకత విచారణను ప్రోత్సహిస్తామని పేర్కొంది. అయితే, దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.

ఈ క్రమంలో అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బేనా బుధవారం సౌత్ బ్లాక్‌లోని విదేశాంగ కార్యాలయానికి వచ్చారు. దాదాపు అరగంట పాటు అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఆమె వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

దౌత్య సంబంధాల్లో ఆయా దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని తాము భావిస్తున్నామని... తోటి ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని, లేదంటే సంబంధాలు దెబ్బతింటాయని అగ్రరాజ్యానికి విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత న్యాయ ప్రక్రియలు స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయని, ఇందులో కచ్చితమైన సమయానుకూల ఫలితాలు వస్తాయని పేర్కొంది. ఇలాంటి వాటిపై అంచనాలు వేయడం సరికాదని హితవు పలికింది. 

More Telugu News