KTR: నామినేషన్లకు ఇంకా సమయం ఉంది... నీకు దమ్ముంటే మనమిద్దరం పోటీ చేద్దాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

  • మల్కాజ్‌గిరిలో పోటీ చేద్దామంటే రేవంత్ రెడ్డి స్పందించడం లేదన్న కేటీఆర్
  • రేవంత్ రెడ్డి మోదీ మనిషా? లేక రాహుల్ గాంధీ మనిషా? అర్థం కావడం లేదని ఎద్దేవా
  • ఈటల రాజేందర్ మంచి డైలాగ్స్ కొడతాడు... నమ్మి ఓటు వేయవద్దని వ్యాఖ్య
brs working president KTR challenges CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్‌గిరిలో పోటీ చేద్దాం రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. బీఆర్ఎస్‌కు దమ్ముంటే ఒక్క సీటైనా గెలవాలని ఈ మధ్య రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారని... అక్కడా ఇక్కడా ఎందుకు? ఆయన సిట్టింగ్ మల్కాజ్‌గిరిలోనే ఇద్దరం పోటీ చేద్దామని తాను చెబితే ఉలుకుపలుకు లేదని విమర్శించారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని... ఆయనకు దమ్ముంటే చెప్పాలని... పోటీ పడదామన్నారు. ఆయనకు నరుకుడు... ఉరుకుడు తప్ప ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు తిట్టుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. అసలు రేవంత్ రెడ్డి... మోదీ మనిషా? లేక రాహుల్ గాంధీ మనిషా? అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి వేసే ప్రతి ఓటు మోదీకి వేసినట్లే అవుతుందన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఈటల రాజేందర్ మంచి డైలాగ్స్ కొడతాడు

ఈటల రాజేందర్ మంచి డైలాగ్స్ కొడతాడని అవి చూసి ఓట్లు వేయవద్దని మల్కాజ్‌గిరి ఓటర్లను కేటీఆర్ కోరారు. గత పదేళ్లలో ప్రధాని మోదీ ఏం చేశారో ఈటల చెప్పాలని నిలదీశారు. ఈటల తాను ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నట్లుగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నాయకులే ఇక్కడ పోటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విషం చిమ్ముతుంటే, కాంగ్రెస్ అబద్ధాల మాటల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు పక్కకు పోయి ఆరు గారడీలు తెరపైకి వచ్చాయన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 10 లక్షల మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని... అందులో వాస్తవం లేదన్నారు. ఒకరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండవచ్చునని... అవి దొంగపనులు చేసేవారివి అనుకుంటానని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దమ్ముంటే విచారణ జరిపించుకోవాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి ఓ లీకువీరుడన్నారు.

More Telugu News