Millionaire Dad: కొడుకుకు 20 ఏళ్లు వచ్చేదాకా.. సామాన్యుడిగా జీవించిన మల్టీమిలియనీర్ తండ్రి

  • ఏటా ఆరువందల కోట్లకు పైగా ఆర్జన అయినా సాదాసీదా జీవితమే
  • కొడుకుకు కష్టం విలువ తెలియాలనే ఇలా పెంచినట్లు వెల్లడి
  • గ్రాడ్యుయేషన్ సెర్మనీలో అసలు విషయం వెల్లడించిన తండ్రి
Multimillionaire Dad Hides Wealth From Son For 20 Years

పూర్వకాలంలో రాజులు తమ వారసులను కొంతకాలం పాటు మారువేషంలో సామాన్య జీవితం గడిపిరావాలని పంపించేవారు.. కాబోయే రాజుగా ప్రజల కష్టసుఖాలను స్వయంగా చూస్తే రాజ్యాధికారం చేపట్టాక జనరంజకంగా పాలిస్తారనేదే దీని వెనకున్న ఉద్దేశం. తాజాగా చైనాకు చెందిన ఓ మల్టీమిలియనీర్ కూడా సరిగ్గా ఇలాగే చేశాడు. తనకున్న ఆస్తిని, ఏటా తన కంపెనీ నుంచి వచ్చే భారీ రాబడిని కొడుకుకు చెప్పకుండా దాచాడు. ఇందుకోసం కుటుంబం మొత్తం ఓ మధ్య తరగతి కుటుంబంలా మారిపోయింది. కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ ఇరవై ఏళ్ల పాటు సాధారణ జీవితం గడిపింది. కొడుకు గ్రాడ్యుయేషన్ సెర్మనీలో తమ ఆస్తుల విలువ చెప్పి సర్ ప్రైజ్ చేశాడా తండ్రి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సదరు మల్టీమిలియనీర్ కొడుకు ఈ విషయాన్ని బయటపెట్టాడు. 

చైనాలో ప్రముఖ చిరుతిండ్ల బ్రాండ్ ‘మాలా ప్రిన్స్’.. ఈ కంపెనీ టర్నోవర్ ఏడాదికి రూ.690 కోట్లకు పైనే ఉంటుంది. ఇంత సంపాదన ఉన్నప్పటికీ దాని యజమాని జాంగ్ యుడాంగ్ మాత్రం మొన్నటి వరకు సామాన్యుడిలా ఓ అపార్ట్ మెంట్ లోనే జీవించాడు. బిజినెస్ లాస్ లో ఉందని, అప్పులపాలయ్యానని కొడుకు జాంగ్‌ జిలాంగ్‌ కు చెప్పాడు. దీంతో కష్టపడి చదివి, మంచి ఉద్యోగం సంపాదించాలనే తపన కొడుకులో పెరిగిందని వివరించాడు. సొంతంగా విజయం సాధించాలనే పట్టుదల పెరిగిందని, ఇందుకోసమే తాను కొడుకును సామాన్యుడిలా పెంచానని చెప్పుకొచ్చాడు. వందల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ జాంగ్ కుటుంబం సాధారణంగానే జీవించింది.

ఒకటి, రెండేళ్లు కాదు ఏకంగా ఇరవై ఏళ్ల పాటు ఓ మధ్యతరగతి అపార్ట్ మెంట్ లో ఉంది. చివరకు జాంగ్ జిలాంగ్ చదువుపూర్తయి పట్టా అందుకున్న రోజు (గ్రాడ్యుయేషన్ సెర్మనీ) జాంగ్ యుడాంగ్ అసలు విషయం వెల్లడించాడు. ఆ తర్వాతే జాంగ్ కుటుంబం ఖరీదైన విల్లాలోకి మారింది. కాగా, తండ్రి చేసిన పనిపై కొడుకు జిలాంగ్ స్పందిస్తూ.. తమ కుటుంబానికి ఓ కంపెనీ ఉందనే విషయం తనకు తెలుసని చెప్పాడు. అయితే, బిజినెస్ లాస్ లో ఉందని, అప్పులపాలయ్యానని తండ్రి చెప్పాడన్నారు. దీంతో బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించాలనే పట్టుదల పెరిగిందన్నాడు. దీనికోసం నిరంతరం కష్టపడి చదివినట్లు వివరించాడు.

More Telugu News