వాషింగ్ మెషిన్లో భారీగా నగదు.. గుర్తించిన ఈడీ
- విదేశాలకు పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నారనే సమాచారంతో దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ
- కొన్ని రోజులుగా పలు కంపెనీల ప్రాంగణాల్లో తనిఖీలు
- రూ.1800 కోట్ల అనుమానిత చెల్లింపుల గుర్తింపు
- సోదాల్లో పట్టుబడ్డ రూ.2.5 కోట్ల నగదు.. ఒక చోట వాషింగ్ మెషిన్లో డబ్బు గుర్తింపు
- వెల్లడించిన ఈడీ అధికారులు
ఈ కంపెనీల భాగస్వాములు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామి, సందీప్ గార్గ్, వినోద్ కేడియాతో పాటు పలువురిని ప్రశ్నిస్తున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. సోదాల్లో పలు అనుమానిత పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటనలో ఈడీ పేర్కొంది. నగదు తరలింపులో ప్రమేయం ఉన్న సంస్థలకు సంబంధించిన మొత్తం 47 బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేశామని ఈడీ అధికారులు వివరించారు.
పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం దాటించబోతున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో సోదాలు నిర్వహించామని ఈడీ పేర్కొంది. సోదాలు జరిపిన కంపెనీల భాగస్వాములు సింగపూర్ గెలాక్సీ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, హారిజోన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీలకు అనుమానాస్పద రీతిలో రూ.1,800 కోట్ల మేర చెల్లింపులు చేసినట్టుగా గుర్తించామని ఈడీ అధికారులు వివరించారు. ఈ రెండు విదేశీ సంస్థలను ఆంథోనీ డిసిల్వా అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. సరుకు రవాణా సేవల పేరిట, దిగుమతుల ముసుగులో సింగపూర్ సంస్థలకు చెల్లింపులు చేశారని వివరించారు. నేహా మెటల్స్, అమిత్ స్టీల్ ట్రేడర్స్‌తో పాటు పలు కంపెనీల సహాయంతో ఈ భారీ చెల్లింపులు చేశారని తెలిపారు.