Chennai Super Kings: గుజరాత్ టైటాన్స్‌పై రికార్డు విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్

Chennai Super Kings recorded a record win over Gujarat Titans in IPL 2024
  • 63 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకున్న గుజరాత్ టైటాన్స్
  • చెన్నై వైపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్
  • 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన శివమ్ దూబేకి దక్కిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-2024లో రెండవ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం రాత్రి చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో రికార్డు స్థాయిలో 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో చెన్నై ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అయితే భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులు మాత్రమే చేశారు. 

ఇన్నింగ్స్ మూడవ ఓవర్‌లోనే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌(8)ను చెన్నై పేసర్ దీపక్ చాహర్‌ ఔట్ చేశాడు. ఆ తర్వాత 5వ ఓవర్‌లో మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(21)ను కూడా చాహర్ పెవిలియన్‌కు పంపించాడు. ఇక క్రీజులో పాతుకుపోయినట్టే కనిపించిన సాయి సుదర్శన్ కూడా వ్యక్తిగత స్కోరు 37 పరుగుల వద్ద నిష్ర్కమించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. దీంతో గుజరాత్ టైటాన్స్ భారీ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, ముస్తాఫీజుర్ రెహ్మాన్, తుషార్ దేశ్ పాండే తలో రెండు వికెట్లు, డారిల్ మిచెల్, మతీష పతిరణ చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో ఓడిన గుజరాత్ టైటాన్స్‌కి ఐపీఎల్ హిస్టరీలో ఇదే అతిపెద్ద ఓటమి. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై 27 పరుగులతో చవిచూసిన ఓటమి అతిపెద్దదిగా ఉండగా ఆ రికార్డు ఈ మ్యాచ్‌లో బ్రేక్ అయ్యింది. 

ఇక టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాయి. ఓపెనర్లు రచిన్ రవీంద్ర(46), రుతురాజ్ గైక్వాడ్ (46)తో పాటు శివమ్ దూబే (51) అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా శివమ్ దూబే 21 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు శివమ్ దూబేకి దక్కింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. సాయి కిశోర్, స్పెన్సర్ జాన్సన్, మొహిత్ శర్మ తలో వికెట్ తీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది.
Chennai Super Kings
Gujarat Titans
IPL 2024
Cricket

More Telugu News