Volunteers: వాలంటీర్లపై సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం... మేం గెలిచాక వాలంటీర్లకు మెరుగైన జీతం ఇస్తాం: అచ్చెన్నాయుడు

  • వాలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి వ్యాఖ్యలు వివాదాస్పదం 
  • కొందరు వాలంటీర్లు కోడ్ ఉల్లంఘిస్తున్నారన్న అచ్చెన్నాయుడు
  • అలాంటివారిని టీడీపీ సమర్థించబోదని స్పష్టీకరణ
Atchannaidu reacts over Bojjala Sudheer Reddy claims on volunteers

శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. 

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొందరు వాలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మక్కై అరాచకాలు, ఆగడాలు చేస్తున్నారని తెలిపారు. అయితే, ప్రభుత్వ నిబంధనలు, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు వారికి మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారని, తెలుగుదేశం పార్టీ వైఖరి ఇదేనని ఉద్ఘాటించారు. 

అయితే, ప్రజా ప్రయోజన కార్యక్రమాలను గాలికి వదిలేసి, వైసీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వాలంటీర్లను టీడీపీ సమర్థించదు అని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. 

ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉల్లంఘించి, వైసీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్న 200 మందికి పైగా వాలంటీర్లు సస్పెండ్ అయ్యారని వెల్లడించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వారి భవిష్యత్ ను వారే పాడుచేసుకుంటున్నారని తెలిపారు. 

జగన్ రెడ్డి అవినీతికి వత్తాసు పలికిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైలుకు వెళితేనే పట్టించుకోలేదని, అలాంటిది, వాలంటీర్లపై కేసులు పెడితే పట్టించుకుంటారా? అని పేర్కొన్నారు. 

ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే వారి భవిష్యత్ అంధకారమే అని వాలంటీర్లు గ్రహించాలని హితవు పలికారు. అందుకే, వాలంటీర్లు చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని కోరుతున్నామని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

More Telugu News