Rohit Sharma: రోహిత్ శర్మ, బుమ్రా మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్

  • గుజరాత్‌పై మ్యాచ్ అనంతరం మైదానంలో ఆసక్తికర ఘటన
  • రోహిత్, బుమ్రా మాట్లాతుండగానే పట్టించుకోకుండా వెళ్లిపోయిన పాండ్యా
  • సోషల్ మీడియాలో వైరల్‌గా వీడియో
  • కెప్టెన్సీ మార్పు నేపథ్యంలో ఊహాగానాలకు దారితీస్తున్న వీడియో
Hardik Pandya Walks Away As Rohit Sharma and Jasprit Bumrah Continue Discussion and Video goes Viral

ఐపీఎల్‌లో అత్యంత ఆదరణ కలిగిన ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్‌ జట్టుని కెప్టెన్ మార్పు వ్యవహారం ఇంకా వెంటాడుతూనే ఉంది. స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను పక్కనపెట్టి కొత్త కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను నియమించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆదివారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌తో ఈ చర్చ మరింత ఉద్ధృతమైంది. ఏకంగా 5 ఐపీఎల్ టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కమాండ్ చేయడం, ఫీల్డింగ్‌లో ప్లేస్‌లు మార్చుతూ అటు ఇటు పంపించడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. దీనిపై పాండ్యాపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమయ్యాయి. రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా హార్ధిక్‌పై దుమ్మెత్తిపోశారు. 

‘‘నువ్వేమైనా ధోనీ అనుకుంటున్నావా.. దిగ్గజ ఆటగాడు రోహిత్‌తో వ్యవహరించే విధానం ఇదేనా?’’ అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరైతే పాండ్యాను రాయలేని పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోల్లో ఒకటి ఆసక్తికరంగా మారింది.  

గుజరాత్ టైటాన్స్‌ బ్యాటింగ్ పూర్తయిన అనంతరం మైదానంలో సీనియర్ ఆటగాళ్లు పాండ్యా, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఏదో చర్చిస్తున్నట్లుగా కనిపించారు. అయితే హార్ధిక్ పాండ్యా మాత్రం మాట్లాడుతుండగానే మధ్యలోనే వెళ్లిపోవడం కనిపించింది. పాండ్యా నిష్క్రమించిన తర్వాత రోహిత్, బుమ్రా మాట్లాడుకోవడం కనిపించింది. అటుగా వెళ్లిపోతున్న పాండ్యా వైపు చెయ్యి చూపిస్తూ రోహిత్‌కు బుమ్రా ఏదో చెప్పాడు. దీంతో వేర్వేరు ఊహాగానాలకు ఇది ఆజ్యం పోసింది. కెప్టెన్ మార్పు తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులో పరిస్థితులు సానుకూలంగా లేవని నెటిజన్లు పేర్కొంటున్నారు.

కాగా జస్ప్రీత్ బుమ్రాకు బదులుగా హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ వేయడాన్ని ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ సమర్థించాడు. హార్దిక్ పాండ్యా 7వ స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని కూడా సమర్థించాడు. పాండ్యా 7వ స్థానంలో బ్యాటింగ్ చేయాలనేది సమష్టి నిర్ణయమని పొలార్డ్ చెప్పాడు.

కాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా ఓటమితో ప్రస్థానాన్ని ప్రారంభించాడు. గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన గుజరాత్ టైటాన్స్ చేతిలోనే పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

More Telugu News