Sanjay Raut: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటే ప్ర‌ధాని మోదీకి భ‌యం: శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌

  • అరెస్ట్ త‌ర్వాత కేజ్రీవాల్ మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారార‌న్న శివ‌సేన ఎంపీ
  • కేజ్రీవాల్ జైలు నుంచి ప‌నిచేయ‌డం మొద‌లు పెట్టారని వెల్లడి 
  • కేజ్రీవాల్‌కు మ‌ద్ద‌తుగా ఇండియా కూట‌మి నిర్వ‌హించే ర్యాలీలో పాల్గొంటాన‌ని వెల్ల‌డి
Shiv Sena MP Sanjay Raut Criticizes PM Narendra Modi

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టుపై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ ఘాటుగా స్పందించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి కేజ్రీవాల్ అంటే భ‌యం అని అన్నారు. అందుకే ఆయ‌న‌ను అరెస్ట్ చేయించార‌ని సంజ‌య్ రౌత్ మండిప‌డ్డారు. అయితే, అరెస్ట్ త‌ర్వాత కేజ్రీవాల్ మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారార‌న్నారు. అలాగే కేజ్రీవాల్ అరెస్టుకు నిర‌స‌న‌గా వ‌చ్చే ఆదివారం (మార్చి 31) ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూట‌మి, ఆప్ బ్లాక్ ర్యాలీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఈ ర్యాలీలో ఇత‌ర నేత‌ల‌తో క‌లిసి తాను కూడా పాల్గొంటాన‌ని సంజ‌య్ రౌత్ వెల్ల‌డించారు. 

రౌత్  ఇంకా మాట్లాడుతూ.. "అర‌వింద్‌ కేజ్రీవాల్ ఇప్పుడే జైలు నుంచి ప‌నిచేయ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌జ‌లు కూడా ఆయ‌న మాట విన‌డంతో పాటు మ‌ద్ద‌తుగా నిలుస్తారు. స్వాతంత్ర్య పోరాటంలో కూడా జైలుకు వెళ్లిన నాయ‌కులు మ‌రింత బ‌లంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు" అని చెప్పుకొచ్చారు. 

ఇదిలాఉంటే.. రాజ‌కీయ నాయ‌కుల‌ను భ‌య‌పెట్టేందుకు, ప్ర‌తిప‌క్షాల‌ను నిర్మూలించేందుకు ప్ర‌ధాని ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ఉప‌యోగించుకుంటున్నార‌ని ఇప్ప‌టికే ప‌లువురు విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా మార్చి 31న అన్ని భార‌త మిత్ర‌ప‌క్షాల నేత‌లు ఏక‌తాటిపైకి వ‌చ్చి ర్యాలీ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

More Telugu News