Ram Charan: జహీరాబాద్ లో సుజీత్ పెళ్లి... నన్నెందుకు పిలవలేదంటూ ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించిన రామ్ చరణ్

  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న రామ్ చరణ్, ఆనంద్ మహీంద్రా సంభాషణ
  • ఓ వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా... స్పందించిన రామ్ చరణ్ 
  • ఏమిటీ సంభాషణ అంటూ ఆసక్తి చూపిస్తున్న నెటిజన్లు
Funny conversion between Ram Charan and Anand Mahindra

సుజీత్ పెళ్లికి నన్నెందుకు పిలవలేదు? అంటూ టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు  విషయం ఏంటనేది తెలుసుకునే ముందు రామ్ చరణ్ ఏమని ట్వీట్ చేశాడో చూస్తే ఆసక్తి కలుగకమానదు. 

"ఆనంద్ మహీంద్రా... జహీరాబాద్ లో సుజీత్ వివాహానికి నన్నెందుకు ఆహ్వానించలేదు? ఇక్కడికి దగ్గర్లోనే కదా నేనుండేది. జహీరాబాద్ లో స్నేహితులను కలవడం సరదాగా ఉండేది. అయితేనేం, మీ మహీంద్రా రైజ్ ఫౌండేషన్ తరపున జహీరాబాద్ లో అద్భుతంగా కృషి చేశారు" అని రామ్ చరణ్ పేర్కొన్నారు. 

ఇక ఈ ట్వీట్ కు ఆనంద్ మహీంద్రా కూడా బదులిచ్చారు. "నిన్ను పిలవకపోవడం తప్పేనని ఒప్పుకుంటున్నాను. గందరగోళంలో పడి నీకు ఇన్విటేషన్ పంపడం మర్చిపోయాను. అన్నట్టు... ఇటీవల నువ్వు నేర్పిన డ్యాన్స్ స్టెప్పులను పర్ఫెక్ట్ గా నేర్చుకోవడంలో నేను పూర్తిగా బిజీగా ఉన్నాను. 

ఏదేమైనా మా సామాజిక సేవను గుర్తించి నీ వంతుగా ప్రోత్సాహకరమైన అభినందనలు తెలుపడం పట్ల కృతజ్ఞతలు. నీ ట్వీట్ కచ్చితంగా ఎంతో సానుకూల ప్రభావం చూపుతుంది. ఈసారి ఎలాంటి పొరబాటు చేయను... అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నా... నీకు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ ఆనంద్ మహీంద్రా బదులిచ్చారు. 

దీనిపై రామ్ చరణ్ స్పందించారు. కృతజ్ఞతలు... త్వరలోనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అని బదులిచ్చారు. 

ఇక, అసలు విషయానికొస్తే... మహీంద్రా సంస్థ తెలంగాణలోని జహీరాబాద్ లో కొన్నాళ్ల కిందట ట్రాక్టర్ల తయారీ యూనిట్ స్థాపించింది. అంతేకాదు, ఈ ప్రాంతాన్ని సామాజికంగా, పర్యావరణపరంగా అభివృద్ధి చేయాలని భావించి మహీంద్రా రైజ్ ఫౌండేషన్ లక్ష చెట్లు నాటింది. పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు తవ్వారు. దాంతో జహీరాబాద్ ప్రాంతంలో భూగర్భ జలాల నీటిమట్టం 400 అడుగుల మేర పెరిగిందని ఆనంద్ మహీంద్రా ఓ ఆసక్తికర వీడియో పోస్టు చేశారు. 

గతంలో ఇక్కడ నీటి ఎద్దడి కారణంగా యువతకు పెళ్లయ్యేది కాదని, ఇప్పుడు నీటి మట్టం పెరగడంతో పెళ్లిళ్లు జరుగుతున్నాయని సుజీత్ అనే పాత్రను ఉపయోగించి వివరించే ప్రయత్నం చేశారు. జహీరాబాద్ లో నీటిమట్టం పెరిగింది... బ్రహ్మచారిగా ఉన్న సుజీత్ కు పెళ్లి ఫిక్సయింది అని వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో కారణంగానే రామ్ చరణ్, ఆనంద్ మహీంద్రా మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

More Telugu News