Telangana High Court: ఆస్తి వివాదంపై తీర్పులో మహాభారతాన్ని ప్రస్తావించిన జడ్జి

  • మొదటి రిజిస్ట్రేషన్ రద్దు కాకుండా తర్వాత చేసిన రిజిస్ట్రేషన్లు చెల్లవంటూ తీర్పు
  • భారతంలో ఇతరులకు ఇచ్చేసిన వాటిని పాండవులకు ఎలా ఇవ్వగలనన్న దుర్యోదనుడు
  • తీర్పు చదువుతూ ఈ విషయాన్ని ప్రస్తావించిన జస్టిస్ నగేష్ భీమపాక
Telangana High Court Judge quotes Mahabharata In Judgement

ఒకసారి ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేశాకే అమ్మకం, కొనుగోలు జరపాలని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. మొదటి రిజిస్ట్రేషన్ రద్దు కాకుండా కొనుగోలు చేసిన వారికి ఆ ఆస్తిపై ఎలాంటి హక్కులు సంక్రమించబోవని తేల్చిచెప్పింది. ఈమేరకు జస్టిస్ నగేష్ భీమపాక శనివారం తీర్పు వెలువరించారు. ఓ ఆస్తి వివాదంలో ఈమేరకు తీర్పు వెలువరిస్తూ.. మహాభారతంలో దుర్యోదనుడి మాటలను ప్రస్తావించారు. ‘పాండవులకు అయిదు ఊళ్లు ఇవ్వాలన్న శ్రీకృష్ణుడి సూచనపై స్పందిస్తూ.. వాటిని ఇప్పటికే సామంత రాజులకు ఇచ్చేశానని, నాకు చెందనివి, ఇతరులకు ఇచ్చేసిన వాటిని పాండవులకు ఎలా ఇవ్వగలనంటూ దుర్యోదనుడు ప్రశ్నిస్తాడు’.. మహాభారతంలోని ఈ వ్యాఖ్యలను కోర్టులో జస్టిస్ చదివి వినిపించారు. ఇదే విధంగా ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాక దానిని రద్దు చేయకుండా ఆ ఆస్తిని మరోసారి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని చెప్పారు. 

ఇదీ కేసు..
రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో 460 ఎకరాల్లో శంకర్‌హిల్స్‌ లేఅవుట్‌ ఉంది. అందులోని 500 చదరపు గజాలను 1983లో గోపు నాగమణి తండ్రి కొనుగోలు చేశారు. పంచాయతీ అనుమతితో వేసిన లేఅవుట్‌లో 1986 దాకా 3,328 ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ జరిగింది. వారంతా కలిసి 1989లో శంకర్‌హిల్స్‌ ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. గతేడాది ఆ ప్లాట్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ కోసం నాగమణి దరఖాస్తు చేసుకోగా.. అధికారులు తిరస్కరించారు. ఈ స్థలం జీవో 111లో ఉందని, అంతేకాకుండా అందులోని కొంత స్థలంపై తమకు హక్కులు ఉన్నాయంటూ జైహింద్‌రెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేమని చెప్పారు. దీంతో విద్యుత్ శాఖపై గోపు నాగమణి కోర్టును ఆశ్రయించగా.. జైహింద్‌రెడ్డి తదితరులు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. రికార్డులు పరిశీలించిన తర్వాత జస్టిస్ నగేష్ భీమపాక అధికారుల తీరును తప్పుబడుతూ వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. 

తీర్పులో జస్టిస్ ఏమన్నారంటే..
‘నాగమణి తండ్రితో పాటు 3 వేలమందికి పైగా అక్కడ భూమిని కొనుగోలు చేశారు. 15 మంది నుంచి ఈ భూమిని కొన్నారు. అదే భూమిలో 33 ఎకరాలను ఆ పదిహేను మందిలో 13 మంది తనకు అమ్మారంటూ జైహింద్ రెడ్డి చెబుతున్నారు. 1997 లో ఈ కొనుగోలు జరిగిందంటున్నారు. అయితే, 1983 నుంచి 1986 వరకు భూమి అమ్మకం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిన భూమిని 1997లో జైహింద్ రెడ్డి కొనుగోలు చేశారు. మొదటి రిజిస్ట్రేషన్ రద్దు కాకుండా రెండోసారి జరిగిన ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు. అందువల్ల జైహింద్ రెడ్డి తదితరులను ప్రతివాదులుగా అంగీకరించలేం. పేద, మధ్య తరగతి వాళ్లు చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్న భూములపై బలవంతులైన వాళ్లు కన్నేసి.. కుట్ర చేస్తామంటే కుదరదు’ అని జస్టిస్ నగేష్ భీమపాక తీర్పు వెలువరించారు. జైహింద్‌రెడ్డి తదితరుల పిటషన్ ను కొట్టివేస్తూ ఒక్కొక్కరూ రూ.1,000 చొప్పున హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీకి చెల్లించాలని ఆదేశించారు.

More Telugu News