Suryakumar Yadav: రిషబ్ పంత్ పునరాగమనంపై సూర్య కుమార్ యాదవ్ ఆసక్తికర స్పందన.. పోస్ట్ వైరల్

Suryakumar Yadav special post for Rishabh Pant on his return goes viral
  • ఎన్నో స్ఫూర్తిదాయక సినిమాలు చూశాను కానీ నిజజీవితానికి దగ్గరగా లేవన్న సూర్య
  • పంత్ కోలుకుని మైదానంలో అడుగుపెట్టిన తీరుపై ప్రశంసల జల్లు
  • అందరూ ఎదురుచూసిన క్షణం వచ్చిందని మెచ్చుకున్న రిషబ్ పంత్
ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై.. వాటి నుంచి కోలుకొని పూర్తి ఫిట్‌నెస్‌తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టడం అంత సులభమైన విషయం కాదు.. కానీ టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ దానిని సుసాధ్యం చేశారు. అసాధారణ రీతిలో కోలుకొని తిరిగి ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా బరిలోకి దిగిన పంత్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. శనివారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ ద్వారా పునరాగమనం చేసిన పంత్‌పై టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ పొగడ్తల వర్షం కురిపించాడు.

‘‘మనమంతా ఎదురుచూసిన క్షణం ఇది. స్ఫూర్తిదాయకమైన సినిమాలు చాలానే చూశాను. కానీ నిజ జీవిత కథకు అవేవీ దగ్గరగా లేవు’’ అని పంత్ కోలుకున్న విధానాన్ని సూర్య ప్రశంసించాడు. ఈమేరకు ఎక్స్ వేదికగా సూర్య స్పందించాడు. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో పంత్ మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఇరు జట్ల అభిమానులు లేచి నిలబడ్డారు. చప్పట్లు, కేరింతలతో మైదానాన్ని మోతెక్కించారు.

పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ.. తిరిగి మైదానంలోకి వచ్చినందుకు దేవుడికి, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నాడు. తిరిగి మైదానంలో అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నాడు. మ్యాచ్‌లో ఆశించిన ఫలితం రాలేదని, క్రమక్రమంగా మెరుగుపడతానని పంత్ చెప్పాడు. 100 శాతం నిబద్ధతతో మెరుగుపడేందుకు కృషి చేస్తానని చెప్పాడు. మైదానంలో ఉండటాన్ని చాలా ఇష్టపడతానని పంత్ వివరించాడు.
Suryakumar Yadav
Rishabh Pant
Delhi Capitals vs Punjab Kings
Cricket
IPL 2024

More Telugu News