RS Praveen Kumar: గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్

RS praveen Kumar counter to Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
తాము గేట్లు తెరిస్తే తమ పార్టీ ఖాళీ అవుతుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం కౌంటర్ ఇచ్చారు. మీరు గేట్లు తెరిస్తే మీ వద్దకు గొర్రెలు వచ్చాయని... అదే మేం గేట్లు తెరిస్తే ఇక్కడికి సింహాలు వచ్చాయని చురక అంటించారు. నిజమైన తెలంగాణవాదులు బీఆర్ఎస్‌లో ఉన్నారని... తెలంగాణను మోసం చేసిన వాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళంతా గేట్లు తోసుకుని అక్కడకు పోతున్నారని ఎద్దేవా చేశారు.

పలువురు బీఎస్పీ నేతలు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన ఉద్యమం చారిత్రాత్మకమన్నారు. కేసీఆర్‌ పాలన స్వర్ణయుగమని... చితికిపోయిన తెలంగాణకు విముక్తి కల్పించారని కితాబునిచ్చారు. రాజ్యాంగ వ్యవస్థలైన ఈడీ, సీబీఐ అన్నింటినీ ప్రధాని మోదీ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు.

లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా తన పోరాటం ఆపేది లేదని... పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అనే ఆయుధంతో బీజేపీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Go Back to Shorts
RS Praveen Kumar
BRS
Revanth Reddy

More Telugu News