Arvind Kejriwal: తన అరెస్ట్, కస్టడీ అక్రమం అంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్
  • కోర్టులో హాజరుపరిచిన ఈడీ... 7 రోజుల కస్టడీ
  • ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల పిటిషన్
  • పిటిషన్ ను వెంటనే విచారించాలని విజ్ఞప్తి
  • కేజ్రీవాల్ విడుదలకు అర్హమైన వ్యక్తి అని పిటిషన్ లో స్పష్టీకరణ
Kejriwal seeks release as his advocates approaches Delhi High Court

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తనను అరెస్ట్ చేయడం, తనకు ఈడీ కస్టడీ విధింపు అక్రమం అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్ పై అత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని, తనను విడుదల చేయాలని కేజ్రీవాల్ కోరారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ అభియోగాలపై కేజ్రీవాల్ ను గురువారం నాడు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఆయనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం ఏడు రోజుల ఈడీ కస్టడీ విధించింది. 

అయితే, ఇవాళ కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్ పై ఆదివారం నాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రిమాండ్ ఆర్డర్ ను రద్దు చేయాలని విన్నవించారు. కేజ్రీవాల్ విడుదలకు అర్హమైన వ్యక్తి అని పిటిషన్ లో స్పష్టం చేశారు. 

ఈడీ అరెస్ట్ చేయకముందు కూడా కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ ను అడ్డుకోవాలని కోరారు. కానీ, కేజ్రీవాల్ అరెస్ట్ కు తాము మినహాయింపునివ్వలేమని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఇప్పుడు, కేజ్రీవాల్ మరోసారి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో, ఈసారి చీఫ్ జస్టిస్ బెంచ్ ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

More Telugu News