Abhishek Porel: ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి చితకబాదిన పొరెల్... ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు

  • ఐపీఎల్ లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ × పంజాబ్ కింగ్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసిన ఢిల్లీ
  • ఆఖరి ఓవర్లో 2 సిక్సులు, 3 ఫోర్లు కొట్టిన పొరెల్
Abhishek Porel last over flares guides Delhi Capitals reasonable score

యంగ్ బ్యాట్స్ మన్ అభిషేక్ పొరెల్ ఆఖరి ఓవర్లో వీర విహారం చేయడంతో పంజాబ్ కింగ్స్ తో పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, ఢిల్లీ జట్టు బ్యాటింగ్ కు దిగింది. 

19 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 8 వికెట్లకు 149 పరుగులే. చేతిలో ఉన్నది మరో రెండు వికెట్లే. చివరి వరుస బ్యాటర్లు కాబట్టి ఏం కొడతారులే అని పంజాబ్ జట్టు కాస్తంత ఏమరుపాటు ప్రదర్శించింది. కానీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అభిషేక్ పొరెల్ చిచ్చరిపిడుగులా చెలరేగడంతో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ జట్టు 9 వికెట్లకు 174 పరుగులతో ఇన్నింగ్స్ ముగిచింది. 

టీ20 స్పెషలిస్ట్ గా పేరుగాంచిన హర్షల్ పటేల్ విసిరిన ఓ ఓవర్లో... పొరెల్ 2 సిక్సులు, 3 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. హర్షల్ పటేల్ విసిరిన ఆ ఓవర్లో ఏకంగా 25 పరుగులు లభించాయి. 

అంతకుముందు, ఢిల్లీ జట్టు బ్యాటింగ్ కార్డ్ చూస్తే... ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (29), మిచెల్ మార్ష్ (20) తొలి వికెట్ కు 39 పరుగులు జోడించారు. వన్ డౌన్ లో వచ్చిన షాయ్ హోప్ ధాటిగా ఆడి 33 పరుగులు చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత బ్యాట్ పట్టి బరిలో దిగిన కెప్టెన్ రిషబ్ పంత్ 13 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేశాడు. 

ఆంధ్రా ఆటగాడు రికీ భుయ్ (3), సఫారీ డైనమిక్ బ్యాట్స్ మన్ ట్రిస్టాన్ స్టబ్స్ (5) నిరాశపరిచారు. ఈ దశలో అక్షర్ పటేల్ (21) సమయోచితంగా ఆడాడు. చివర్లో పొరెల్ బ్యాట్ ఝళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. 

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, హర్షల్ పటేల్ 2, రబాడా 1, హర్ ప్రీత్ బ్రార్ 1, రాహుల్ చహర్ 1 వికెట్ తీశారు.

More Telugu News