SRH Vs KKR: నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్.. బలాబలాలు, రికార్డులు ఇవే!

  • ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్
  • కొత్త కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సారధ్యంలో బరిలోకి దిగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
  • హైదరాబాద్ కోచ్‌గా వ్యవహరిస్తున్న డేనియెల్ వెట్టోరి
  • రూ.24.75 కోట్లతో కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్‌తో పటిష్ఠంగా కనిపిస్తున్న కోల్‌కతా జట్టు
SRH to play its first against KKR in IPL 2024

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జట్టు నేడు (శనివారం) తొలి మ్యాచ్ ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. రికార్డు ధరకు కొనుగోలు చేసిన ఆసిస్ ఆటగాడు పాట్ కమిన్స్‌ సారధ్యంలో హైదరాబాద్ జట్టు టైటిల్ వేటను మొదలుపెట్టబోతోంది. వెన్నునొప్పి కారణంగా గతేడాది సీజన్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో కోల్‌కతా బరిలోకి దిగబోతోంది. ఇటీవలే రంజీ ట్రోఫీలో కూడా ఆడి పూర్తి ఫిట్‌నెస్‌తో అయ్యర్ సిద్ధమయ్యాడు. 

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో శ్రేయాస్ అయ్యర్‌తో పాటు ఏకంగా రూ.24.75 కోట్లతో కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు. రికార్డు ధర పలకడంతో అందరి దృష్టి స్టార్క్ ప్రదర్శనపైనే పడింది. కోల్‌కతాకు గౌతమ్ గంభీర్‌ తిరిగి ఈ సీజన్‌లో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. గంభీర్ సూచనలు ఆ జట్టుకు కలిసి వస్తాయనే అంచనాలు నెలకొన్నాయి. సొంత మైదానంలో జరుగుతుండడంతో అభిమానుల మద్దతు కూడా ఆ జట్టుకు దక్కనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారనే అంచనాలు నెలకొన్నాయి.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే పాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా వుండగా, న్యూజిలాండ్ మాజీ దిగ్గజం డేనియల్ వెట్టోరీ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఏసీ20 లీగ్‌ని (సౌతాఫ్రికా) వరుసగా రెండవసారి గెలిచిన ‘సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌’కు నాయకత్వం వహించిన ఐడెన్ మార్‌క్రమ్ జట్టులో ఉన్నప్పటికీ పాట్ కమిన్స్ వైపే సన్‌రైజర్స్ యాజమాన్యం మొగ్గుచూపింది. 

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఐపీఎల్‌లో ఇప్పటివరకు 25 సార్లు తలపడగా ఎస్‌ఆర్‌హెచ్‌దే పైచేయిగా ఉంది. ఎస్ఆర్‌హెచ్ 16 మ్యాచ్‌లు గెలవగా.. కోల్‌కతా కేవలం తొమ్మిది విజయాలు మాత్రమే సాధించింది. నేటి మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

తుది జట్టు అంచనాలు ఇవే
కోల్‌కతా: వెంకటేష్ అయ్యర్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్య్రూ రస్సెల్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్.

More Telugu News