Russia: రష్యాలో ఉగ్రవాదుల నరమేధం.. 70 మంది మృతి

  • మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై దాడి
  • గ్రెనేడ్లు విసరడంతో పాటు కాల్పులకు తెగబడ్డ ముష్కరులు
  • భద్రతా బలగాల యూనిఫాం ధరించి హాలులోకి ప్రవేశం
  • దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసిన ఇస్లామిక్ స్టేక్
  • ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
70 Dead After terrorists Open Fire and Throw Bombs At Concert Hall Near Moscow in Russia

రష్యాలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. రాజధాని మాస్కో ఉత్తర శివారు ప్రాంతం క్రాస్నోగోర్స్క్‌లోని క్రోకస్ సిటీ అనే మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై ముష్కరులు బాంబులు విసరడంతోపాటు కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కనీసం 70 మంది మృత్యువాతపడినట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. మరో 100 మందికిపైగా గాయపడ్డారని సమాచారం. 

ఈ భయానక ఉగ్రదాడిపై దర్యాప్తు మొదలైంది. ఉగ్రవాదులు ఎలాంటి అనుమానం రాకుండా భద్రతా బలగాల యూనిఫాం ధరించి కన్సర్ట్ హాలులోకి ప్రవేశించారని ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది. గ్రెనే‌డ్లు విసరడంతో పాటు కాల్పులకు తెగబడ్డారని వివరించింది. కన్సర్ట్ హాలులో మంటలు వ్యాపించాయని తెలిపింది. ఇంటర్నేషనల్ మ్యూజిక్ బృందం ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని అధికారులు వివరించారు. మృతదేహాలను పరిశీలిస్తున్నామని, బాధితుల సంఖ్య పెరగవచ్చని పేర్కొన్నారు. రష్యా భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. అయితే తీవ్రవాదులను మట్టుబెట్టారా? లేక అదుపులోకి తీసుకున్నారా? అనే దానిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

ఈ దాడికి బాధ్యత తమదేనని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటన విడుదల చేసింది. అనుబంధ గ్రూపు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. మాస్కోతో పాటు ఇతర నగరాల్లో ఇస్లామిక్ గ్రూపులు దాడులకు పాల్పడవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. మరోవైపు ఈ దాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటన విడుదల చేశారు. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ తిరిగి ఎన్నికైన కొన్ని రోజులకే ఈ ఉగ్రదాడి జరగడం గమనార్హం.

More Telugu News