IPL 2024: రాణించిన మిడిలార్డర్.. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ

Middle order batting and Mustafizur heldp  CSK beat RCB by six wickets
  • ఆరు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సీఎస్కే విజయం
  • 174 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలివుండగానే ఛేదించిన చెన్నై
  • రాణించిన శివమ్ దూబే, రవీంద్ర జడేజా.. బౌలింగ్‌లో మెరిసిన ముస్తాఫీజుర్
మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడం, బౌలర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేయడంతో ఐపీఎల్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. చెన్నై వేదికగా జరిగిన తొలి పోరులో ఆర్సీబీపై గైక్వాడ్ సేన 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగిలివుండగానే ఛేదించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ ముస్తాఫిజుర్ అద్బుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీశాడు. దీంతో ఒకానొక దశలో ఆర్సీబీ స్కోరు బోర్డు నెమ్మదించింది. అయితే అనూజ్ రావత్ (48), దినేష్ కార్తీక్ (38 నాటౌట్) ఇద్దరూ కలిసి 6వ వికెట్‌కు 95 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆర్సీబీ కోలుకుంది. ప్రత్యర్థి చెన్నై ముందు 174 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 

ఇక లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాటర్లు సమష్టిగా రాణించారు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర తొలి వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత అజింక్యా రహానే (27), డారిల్ మిచెల్ (22), శివమ్ దూబే (34 నాటౌట్), రవీంద్ర జడేజా (25 నాటౌట్) చొప్పున కీలకమైన పరుగులు సాధించారు. మిడిలార్డర్‌లో శివమ్ దూబే, రవీంద్ర జడేజా 66 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో చెన్నై సునాయాసంగా విజయం సాధించింది. 18.4 ఓవర్లలో 176/4 మ్యాచ్‌ను ముగించారు.
 
తొలి ఐపీఎల్ ఆడుతున్న న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర చెలరేగాడు. 15 బంతుల్లో 37 పరుగులు బాదాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఆర్సీబీ బౌలర్లలో కామెరాన్ గ్రీన్ ఫర్వాలేదనిపించాడు. మూడు ఓవర్లు వేసి 2 కీలకమైన వికెట్లు తీశాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆర్సీబీపై సీఎస్కేకి ఇది వరుసగా ఎనిమిదవ విజయం కావడం గమనార్హం.
IPL 2024
RCB vs CSK
Royal Challengers Bengaluru
Chennai Super Kings
Cricket

More Telugu News