Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన

  • ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్
  • దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు
  • కేజ్రీవాల్ అరెస్ట్ పై సాంకేతిక విషయాలను వెల్లడించిన లక్ష్మీనారాయణ
CBI former JD Lakshmiarayana opines on Kejriwal arrest

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. కేజ్రీవాల్ అరెస్ట్ పై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో పలుమార్లు కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు సమన్లు పంపారని, కానీ ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదని, ఈ నేపథ్యంలోనే ఆయనను ఈడీ అధికారులు గత రాత్రి అరెస్ట్ చేశారని వివరించారు. 

అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టడం, ఆ తర్వాత, ఏ ఆధారాలతో అరెస్ట్ చేయడం జరిగిందో ఆ విషయాలను దర్యాప్తు సంస్థ కోర్టుకు వివరించడం సాధారణంగా జరిగే ప్రక్రియ అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అరెస్ట్ కు గల కారణాలు ఏంటనే విషయమై తమ వద్ద ఉన్న పత్రాలను కోర్టు ముందు పెట్టి కస్టడీకి కోరే అవకాశముంటుందని తెలిపారు. మొన్న కవితను 10 రోజుల కస్టడీకి అప్పగించాలని ఎలా అడిగారో, ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలోనూ అలాగే వ్యవహరిస్తారని వివరించారు. 

"తాము చేసిన అరెస్ట్ ను సదరు దర్యాప్తు సంస్థ సహేతుకంగా నిరూపించాల్సి ఉంటుంది. సదరు వ్యక్తుల నుంచి కొంత ప్రత్యేకమైన సమాచారాన్ని రాబట్టాలంటే అరెస్ట్ తప్ప మరో మార్గం లేదని దర్యాప్తు సంస్థలు కోర్టుకు వివరించాల్సి ఉంటుంది. పవర్స్ ఉన్నాయి కదా అని అరెస్ట్ చేయడం ఒకటి... అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి నుంచి ఏ విధమైన సమాచారం, ఎలా రాబట్టాలన్నది మరొక ముఖ్యమైన అంశం. 

ఇక, కోర్టు విషయానికొస్తే... దర్యాప్తు సంస్థ వద్ద ఉన్న ఆధారాలు, వారు చెబుతున్న కారణాలను సమీక్షించుకుని, నిందితులను దర్యాప్తు సంస్థకు కస్టడీకి ఇవ్వాలా, వద్దా... లేక జ్యుడిషియల్ కస్టడీకి పంపడమా, లేకపోతే బెయిల్ ఇవ్వడమా? అనేది నిర్ణయించుకుంటుంది. అరెస్ట్ తర్వాత కోర్టులో సర్వసాధారణంగా జరిగే మూడు పరిణామాలు ఇవే. అరెస్ట్ చేసిన వారిని కోర్టులో ప్రవేశపెట్టాక ఎలాంటి వాదనలు జరుగుతాయో చూడాల్సి ఉంటుంది. 

ఇప్పుడీ కేసులో ఈడీ అధికారులు కవితను, కేజ్రీవాల్ ను ఒకే చోట కూర్చోబెట్టి ఇద్దరినీ కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే కవితను అరెస్ట్ చేసి ఉన్నందున, ఆమె నుంచి సేకరించిన సమాచారాన్ని, కేజ్రీవాల్ నుంచి సేకరించే సమాచారంతో పోల్చి చూసుకుని కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తారు. 

కేసు దర్యాప్తు దశలో ఉన్నప్పుడు కోర్టులు కూడా పెద్దగా జోక్యం చేసుకోవు. దర్యాప్తు సంస్థలకు మరింత అవకాశం ఇవ్వాలన్న వైఖరిని కోర్టులు కనబరుస్తాయనేందుకు అనేక తీర్పులు నిదర్శనంగా ఉన్నాయి. ఏదైనా కేసులో ప్రాథమిక అరెస్ట్, కస్టడీ విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకున్న దాఖలాలు పెద్దగా లేవు. అయితే, వీళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాబట్టి, సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఎలా తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది" అని లక్ష్మీనారాయణ వివరించారు.

More Telugu News