Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్టుపై అన్నా హజారే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

His arrest is because of his own deeds says Anna Hazare on Arvind Kejriwal
  • త‌న మాట విన‌లేద‌ని కేజ్రీవాల్‌పై మండిప‌డ్డ సామాజిక ఉద్యమకారుడు 
  • త‌న‌తో క‌లిసి మ‌ద్యానికి వ్య‌తిరేకంగా మాట్లాడిన వ్య‌క్తి.. లిక్క‌ర్ పాల‌సీలు రూపొందించాడంటూ ధ్వ‌జం
  • 2011లో కాంగ్రెస్ ప్రభుత్వంపై సామాజికవేత్తతో క‌లిసి కేజ్రీవాల్‌ పోరాటం
ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు అయిన  విషయం తెలిసిందే. అయితే, కేజ్రీవాల్ అరెస్టుపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ తన మాట వినలేదని మండిప‌డ్డారు. తనతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్.. లిక్కర్ పాలసీలు రూపొందించాడని దుయ్య‌బ‌ట్టారు. తన కర్మలఫలంగానే ఆయన అరెస్టయ్యాడని హజారే వ్యాఖ్యానించారు. అధికారం ముందు ఏదీ ప‌ని చేయ‌ద‌న్నారు. అరెస్టు జ‌రిగింద‌ని, చ‌ట్ట ప్ర‌కారం ఏది జ‌ర‌గాలో అది జ‌రు‌గుతుంద‌ని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు. 

కాగా, 2011లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన పోరాటంలో మాజీ ఐఆర్ఎస్ అధికారి కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆయన వెన్నంటి నిలిచిన కేజ్రీవాల్.. 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు. మొదటిసారి 2013 ఢిల్లీ ఎన్నికల్లో పోటీచేసి ముఖ్య‌మంత్రి అయ్యారు. 

అయితే, కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్ నేతల్లో ఆందోళన నెలకొంది. లోక్ సభ ఎన్నికల ముందు ఆయన అరెస్ట్ కావడం నేతలకు షాక్ ఇచ్చినట్టయింది. మ‌రోవైపు ఆప్ కార్య‌క‌ర్త‌లు కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ ఢిల్లీ వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌డుతున్నారు. అలాగే ఈ అరెస్టును ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా ఖండించాయి.
Arvind Kejriwal
Anna Hazare
Delhi Liquor Scam
AAP

More Telugu News