IPL 2024: కెప్టెన్సీ గురించి ధోనీ భయ్యా ముందే హింట్ ఇచ్చాడు: రుతురాజ్ గైక్వాడ్‌

  • గ‌త సీజ‌న్‌లోనే సీఎస్‌కే ప‌గ్గాల‌పై ధోనీ చ‌ర్చించాడ‌న్న రుతురాజ్‌
  • కెప్టెన్సీ విష‌యంలో తాను స‌ర్‌ప్రైజ్ కాకూడదనే ముందే చెప్పిన‌ట్లు వివ‌ర‌ణ‌
  • చెన్నై జ‌ట్టులో తాను కొత్త‌గా చేయాల్సిన మార్పులేమీ లేవ‌న్న కొత్త సార‌ధి
Ruturaj Gaikwad Reacts As He Takes Over MS Dhoni As CSK Captain

మ‌రికొన్ని గంటల్లో ఐపీఎల్‌-2024 ప్రారంభం కానుంది. ధ‌నాధ‌న్ ఆట‌తో ప్లేయ‌ర్లు క్రికెట్ అభిమానుల‌ను ఉర్రూత‌లూగించ‌నున్నారు. రెండు నెల‌ల‌కుపైగా జ‌ర‌గనున్న ఈ టోర్నీలో ప‌ది జ‌ట్లు పాల్గొంటున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే-ఆర్‌సీబీ మ‌ధ్య జ‌రిగే తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 17వ సీజ‌న్ మొద‌లుకానుంది. అయితే, టోర్నీ ప్రారంభానికి ఒక్క‌రోజు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు కెప్టెన్ మార్పు అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. 

ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన మ‌హేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుని యువ ఆట‌గాడు రుతురాజ్ గైక్వాడ్‌కు అప్ప‌గించ‌డం జ‌రిగింది. గురువారం ఐపీఎల్‌-2024 ట్రోఫీతో ప‌ది జ‌ట్టుల కెప్టెన్లు ఫొటోషూట్ జ‌రిగింది. ఆ స‌మ‌యంలోనే చెన్నై కెప్టెన్సీ మార్పు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ధోనీ బదులుగా రుతురాజ్ రావ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికే సీఎస్‌కే అధికారికంగా రుతురాజ్ గైక్వాడ్ త‌మ జ‌ట్టు కొత్త సార‌ధి అని ప్ర‌క‌టించింది. 

తాజాగా త‌నకు కెప్టెన్సీ ద‌క్క‌డంపై రుతురాజ్ మాట్లాడిన వీడియోను ఐపీఎల్ అధికారిక 'ఎక్స్' (గ‌తంలో ట్విట‌ర్) ఖాతాలో పోస్ట్ అయింది. ఇందులో రుతురాజ్ మాట్లాడుతూ.. "గ‌తేడాదే మ‌హీ భాయ్యా ఒకానొక సంద‌ర్భంలో కెప్టెన్సీ గురించి హింట్ ఇచ్చాడు. చెన్నై ప‌గ్గాలు చేప‌ట్టేందుకు సిద్ధంగా ఉండాల‌ని చెప్పాడు. నేను ఒక్కసారిగా స‌ర్‌ప్రైజ్ కాకూడదనే అలా ముందే చెప్పాడు" అని రుతురాజ్ అన్నాడు. ఆ త‌ర్వాత ఇదే విష‌యం ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కూడా తాను చ‌ర్చించిన‌ట్లు సీఎస్‌కే కొత్త సార‌ధి తెలిపాడు. అలాగే ప్ర‌స్తుతం చెన్నై జ‌ట్టులో తాను కొత్త‌గా చేయాల్సిన మార్పులేమీ లేవ‌న్నాడు.

More Telugu News