ARRW: హైపర్ సోనిక్ మిస్సైల్ ను పరీక్షించిన అమెరికా... రష్యా, చైనాలకు హెచ్చరిక!

  • పసిఫిక్ మహాసముద్రంలో తొలిసారి హైపర్ సోనిక్ మిస్సైల్ టెస్ట్ చేపట్టిన అమెరికా
  • బి-52 బాంబర్ నుంచి దూసుకెళ్లిన ఏఆర్ఆర్ డబ్ల్యూ మిస్సైల్
  • ప్రయోగం విజయవంతం
US Airforce tests Hyper sonic missile

అమెరికా వాయుసేన పసిఫిక్ మహాసముద్రంలో తొలిసారిగా ఓ హైపర్ సోనిక్ మిస్సైల్ ను పరీక్షించింది. గ్వామ్ దీవిలో ఉన్న ఆండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయల్దేరిన బి-52 బాంబర్ విమానం నుంచి ఈ హైపర్ సోనిక్ మిస్సైల్ ను ప్రయోగించారు. మార్చి 17న ఈ క్షిపణి పరీక్ష చేపట్టగా, కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించినట్టు తెలుస్తోంది. 

కాగా, ఈ శత్రుభీకర క్షిపణి ప్రయోగాన్ని అమెరికా చేపట్టడం వెనుక వ్యూహాత్మక ప్రయోజనాలు దాగున్నాయని, ఇది రష్యా, చైనాలకు హెచ్చరిక వంటిదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మిసైల్ ను 'ఆల్ అప్ రౌండ్ ఏజీఎం 183ఏ ఎయిర్ లాంచ్ డ్ రాపిడ్ రెస్పాన్స్ వెపన్'(ఏఆర్ఆర్ డబ్ల్యూ) గా వ్యవహరిస్తారు. 

ఈ ప్రయోగం తీరుతెన్నులను పసిఫిక్ మహాసముద్రంలోని మార్షల్ దీవుల్లో ఉన్న రీగన్ టెస్ట్ సైట్ నుంచి పర్యవేక్షించారు. ఇప్పటివరకు ఏఆర్ఆర్ డబ్ల్యూ క్షిపణిని అమెరికా ప్రధాన భూభాగం నుంచి పలుమార్లు పరీక్షించారు. కీలకమైన భూతల స్థావరాలను ధ్వంసం చేయడంలో ఈ క్షిపణి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. 

దీని వేగం గంటకు 4 వేల కిలోమీటర్లు. సాంకేతిక పరిభాషలో ఇది మాక్ 5 వేగంతో దూసుకెళుతుంది. రెప్పపాటులో దూసుకెళ్లే ఈ క్షిపణిని గుర్తించడం కానీ, మార్గమధ్యంలోనే అడ్డుకోవడం కానీ జరిగే పని కాదు! 

కాగా, చైనా, రష్యా దేశాలు కూడా హైపర్ సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయి. చైనా 2014 నుంచే ఈ పనిలో నిమగ్నమై ఉంది. 2021లో చైనా ప్రయోగించిన హైపర్ సోనిక్ మిస్సైల్ కు ప్రపంచాన్ని చుట్టివచ్చే సామర్థ్యం ఉందని ఓ అమెరికా వాయుసేన అధికారి తెలిపారు. 

ఇక, ఈ విషయంలో మరింత ముందున్న రష్యా తన జిర్కాన్ హైపర్ సోనిక్ మిస్సైల్ ను ఈ ఏడాది ఆరంభంలో ఉక్రెయిన్ పై ప్రయోగించింది.

More Telugu News