Revanth Reddy: మల్కాజ్‌గిరిలో నా గెలుపు... తెలంగాణకు సీఎం స్థాయికి ఎదిగేలా చేసింది: రేవంత్ రెడ్డి

  • సీఎంగా మాట్లాడగలుగుతున్నానంటే ఆ గొప్పతనం మల్కాజ్‌గిరి నియోజకవర్గ ప్రజలదేనని వ్యాఖ్య
  • ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు మాత్రం తనను భుజాలపై మోసి ఎంపీగా గెలిపించారన్న సీఎం
  • కేంద్రంతో సఖ్యతగా మెలిగి స్కైవేలు నిర్మించుకుంటున్నామని వెల్లడి
Revanth Reddy in Malkajgiri congress lok sabha meeting

మల్కాజ్‌గిరిలో తన గెలుపు... తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తాను సీఎంగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే ఆ గొప్పతనం మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలదే అన్నారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు మాత్రం తనను భుజాలపై మోసి ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారని గుర్తు చేసుకున్నారు. 2,964 బూత్‌లలో ప్రతి బూత్‌లో ఒక సైనికుడిలా కార్యకర్తలు పని చేశారన్నారు.

దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్‌గిరి అని... నాటి మల్కాజ్‌గిరి గెలుపు తాను ఈ స్థాయికి ఎదిగేందుకు దోహదపడిందన్నారు. కేసీఆర్ పతనం 2019 మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచే ప్రారంభమైందన్నారు. తాము 100 రోజులు పూర్తిగా పాలన పైనే దృష్టి సారించామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసుకుంటున్నామన్నారు.

కేంద్రంతో సఖ్యతగా మెలిగి స్కైవేలు నిర్మించుకుంటున్నాం

మల్కాజ్‌గిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా మెలిగి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా... జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యలు తీరాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రమంతా తుఫాను వచ్చినట్లు గెలిచినా మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానంలో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగింట గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదన్నారు.

అందుకే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నారు. అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చిందని... పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవాలన్నారు. పార్టీ అభ్యర్థులను హోలీ పండుగ నాడు అధిష్ఠానం ప్రకటిస్తుందని తెలిపారు.

More Telugu News