RBI: ఆదివారమైనా సరే మార్చి 31న ఆ బ్యాంకులన్నీ పనిచేయాలి.. ఆర్బీఐ కీలక ఆదేశాలు

  • మార్చి 31న దేశవ్యాప్తంగా తెరచివుండనున్న ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచులు
  • ఆర్థిక సంవత్సరం 2023-24కి ముగింపు రోజు కావడంతో ఆర్బీఐ నిర్ణయం
  • ప్రభుత్వ కార్యకలాపాలకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరడంతో సానుకూలంగా స్పందించిన కేంద్ర బ్యాంక్
RBI directs these banks to remain open even on Sunday March 31

మార్చి 31వ తేదీ ఆదివారమే అయినప్పటికీ అన్ని ఏజెన్సీ బ్యాంకులు పనిచేయాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం 2023-24కి మార్చి 31 చివరి రోజు కావడంతో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచ్‌లు తెరిచే ఉండాలని సూచించింది. ప్రభుత్వ రశీదులు, చెల్లింపులతో ముడిపడిన బ్యాంకుల బ్రాంచులు అన్నింటిని మార్చి 31న (ఆదివారం) తెరిచి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అవసరమైన బ్రాంచులను తెరిచి ఉంచుతున్నామని, సేవలు లభిస్తాయంటూ ప్రచారం కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలిచ్చింది. కాగా బ్యాంకులు సాధారణంగా అన్ని ఆదివారాలు, ప్రతి నెల 2, 4వ శనివారాల్లో మూసి ఉంటాయనే విషయం తెలిసిందే.

అసలు ఏజెన్సీ బ్యాంకులు అంటే?
అన్ని బ్యాంకుల మాదిరిగా ఏజెన్సీ బ్యాంకులు కూడా కమర్షియల్ బ్యాంకులే. అయితే ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి ఏజెన్సీ బ్యాంకులకు మాత్రమే ఆర్బీఐ అధికారం ఇస్తుంది. ఈ బ్యాంకులు ప్రభుత్వం తరపున వివిధ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు, ప్రభుత్వ సేవలను సులభతరం చేయడంలో ఏజెన్సీ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పన్నుల సేకరణ, ప్రభుత్వ చెల్లింపులు, పంపిణీతో పాటు ముఖ్యమైన పలు సేవలను అందిస్తున్నాయి.

ఏజెన్సీ బ్యాంకులు ఇవే..
ప్రభుత్వరంగ బ్యాంకులు(విలీనం తర్వాత)
1. బ్యాంక్ ఆఫ్ బరోడా, 2. బ్యాంక్ ఆఫ్ ఇండియా, 3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, 4. కెనరా బ్యాంక్, 5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 6. ఇండియన్ బ్యాంక్, 7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, 8. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, 9. పంజాబ్ నేషనల్ బ్యాంక్, 10. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 11. యూకో బ్యాంక్, 12. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

షెడ్యూల్డ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు
1. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్, 3. డీసీబీ బ్యాంక్ లిమిటెడ్, 4. ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్, 5. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, 6. ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్, 7. ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, 8. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, 9. ఇండస్ ఇండ్ బ్యాంక్ లిమిటెడ్, 10. జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్, 11. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్, 12. కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్, 13. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, 14. ఆర్బీఎల్ బ్యాంక్ లిమిటెడ్, 15. సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, 16. యస్ బ్యాంక్ లిమిటెడ్, 17. ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్, 18. బంధన్ బ్యాంక్ లిమిటెడ్, 19. సీఎస్‌బీ బ్యాంక్ లిమిటెడ్, 20. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ జాబితాలో ఉన్నాయి. ఇక విదేశీ బ్యాంకుల జాబితాలో డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ ఉంది.

More Telugu News