Manchu Manoj: కుటుంబానికే సాయం చేయనివాళ్లు మీకేం చేస్తారు: ఓటుపై మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Manchu manoj about choosing the right candidate in elections
  • మంగళవారం తిరుపతిలో మోహన్‌బాబు విశ్వవిద్యాలయ వార్షికోత్సవం
  • కార్యక్రమంలో పాల్గొన్న సినీనటులు మంచు మనోజ్, మోహన్‌లాల్, ముఖేశ్ రిషి
  • పేదలకు సాయపడేవారికే ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చిన మంచు మనోజ్
  • భారత్‌కు మరోసారి మోదీ ప్రధాని అయితే మంచిదన్న మోహన్‌బాబు
పేదలకు అండగా నిలిచేవారికే ఓటు వేయాలని సినీ నటుడు మంచు మనోజ్ సూచించారు. డబ్బులిచ్చారని ఓటువేయొద్దని తెలిపారు. మోహన్‌బాబు విశ్వవిద్యాలయ వార్షికోత్సవం, ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో నటులు మోహన్‌లాల్, ముఖేశ్ రుషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘‘అందరితో కలిసి ముందుకు వెళ్తున్నాడా? ఏమైనా దారుణాలకు పాల్పడుతున్నాడా? అనేది విశ్లేషణ చేసి పది మందితో కలిసి ముందుకు సాగే సరైన లీడర్‌ను ఎన్నుకోండి. కుటుంబానికి, చుట్టుపక్కల వాళ్లకే సాయం చేయలేని వారు మీకేం హెల్ప్ చేస్తారు. అది గుర్తు పెట్టుకుని.. మీకు, మీ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు ఎవరు వస్తే అండగా ఉంటారో విశ్లేషించి ఓటు వేయండి. డబ్బులిచ్చారని, వేయొద్దు. మీకు నచ్చిన వాళ్లను ఎన్నుకోండి’’ అని మనోజ్ అన్నారు.

ఇక మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘‘ప్రతి నాయకుడిగా నేను ఎన్నో సినిమాల్లో చేశా. ఇప్పటికీ విలన్ పాత్రలంటేనే ఇష్టం. విలన్ పాత్రల్లో నటనకు స్కోప్ ఎక్కువ. నా మిత్రుడు మోహన్‌లాల్ అంటే నాకెంతో ఇష్టం. ఆయన నటించిన ‘చిత్రం’ను తెలుగులో ‘అల్లుడుగారు’గా తీసి విజయాన్ని అందుకున్నా. ఆనాటి నుంచి మేమిద్దం మంచి స్నేహితులమయ్యాం. కన్నప్పలో యాక్ట్ చేసినందుకు ఇప్పటివరకూ ఆయన ఒక్క రూపాయి తీసుకోలేదు’’ అని చెప్పారు. 

కులమతాలకు అతీతంగా విద్య అందించాలనే ఉద్దేశంతో విద్యాసంస్థలు ప్రారంభించానని అన్నారు. అది అంచెలంచెలుగా ఎదిగి విశ్వవిద్యాలయంగా మారిందన్నారు. తనకున్న దానిలో పిల్లల చదువు కోసం ఇవ్వాలనుకుని విద్యాసంస్థలు మొదలుపెట్టానని అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. భారత ప్రధానిగా మోదీ వస్తేనే ఈ దేశం మరింత వృద్ధి చెందుతుందని నమ్ముతున్నానని తెలిపారు.
Manchu Manoj
Mohan Babu
Tollywood

More Telugu News