Volunteers: కడప జిల్లాలో 11 మంది వాలంటీర్లపై వేటు

  • దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు
  • ఏపీలోనూ కోడ్ ను కఠినంగా అమలు  చేస్తున్న ఎన్నికల సంఘం
  • నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు 
EC has taken strict measures on rules breaking volunteers

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి పట్ల ఎన్నికల సంఘం  కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా, కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో 11 మంది వాలంటీర్లపై వేటు పడింది. మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందిన 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. ఈ నెల 17న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నట్టు గుర్తించారు. ఆ విషయం నిర్ధారణ కావడంతో వాలంటీర్ల తొలగింపుపై మైలవరం ఎంపీడీవో ఆదేశాలు జారీ చేశారు. 

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలోనూ నలుగురు వాలంటీర్లను తొలగించారు. వీరు వైసీపీ కండువాలు, టోపీలు ధరించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు తేలింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉణదుర్రులో 9 మంది వాలంటీర్లపై చర్యలు తీసుకున్నారు. వైసీపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈ వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. 

అటు, పల్నాడు జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మైదవోలు వీఆర్ఏపై వేటు వేశారు. వీఆర్ఏ నాగేశ్వరరావు వైసీపీ నేతల సమావేశంలో పాల్గొన్నట్టు నిర్ధారణ కావడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు. 

సత్యసాయి జిల్లాలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న కదిరి ప్రభుత్వ పాఠశాల సీనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ను, పుట్టపర్తి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రామాంజనేయులును సస్పెండ్ చేశారు. ఈ మేరకు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News