Sadhguru: బ్రెయిన్ సర్జరీ అయినా తగ్గని జోరు.. ఆసుపత్రి బెడ్‌పై నుంచే సద్గురు ఫన్నీ కామెంట్స్!

  • ఇటీవల ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ
  • ఆపరేషన్ తరువాత వీడియో రిలీజ్ చేసిన సద్గురు
  • ఏదో కనిపెట్టేందుకు వైద్యులు తన కపాలం తెరిచి చూస్తే ఏమీ కనబడలేదని వ్యాఖ్య
  • విసుగొచ్చి ఆపరేషన్ ముగించారంటూ కామెంట్
Sadhguru makes fun releases a video from hospital bed on his Brain Surgery

ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు ఇటీవల బ్రెయిన్ సర్జరీ జరిగింది. కొన్ని వారాలుగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న ఆయనకు మెదడులో రక్తస్రావం అయినట్టు గుర్తించిన అపోలో ఆసుపత్రి వైద్యులు మార్చి 17న విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తాజాగా ప్రకటించారు. మరోవైపు, సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కూడా తన ఆరోగ్యం గురించి ఫన్నీ వ్యాఖ్యలు చేశారు. 

‘‘ఆసుపత్రిలో వైద్యులు నా కపాలం తెరిచి ఏదైనా ఉందేమో కనుక్కునేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్లకేం దొరకలేదు. లోపల ఖాళీగా ఉంది. చివరకు వారు విసిగిపోయి తలకు కుట్లేసి ఆపరేషన్ ముగించారు. ప్రస్తుతం నేను  ఇక్కడ (ఢిల్లీ) నెత్తిపై కట్టుతో ఉన్నాను. కానీ బ్రెయిన్‌కు మాత్రం ఎటువంటి డ్యామేజ్ కాలేదు’’ అని ఆయన ఫన్నీ వ్యాఖ్యలు చేశారు. 

కొన్ని వారాలుగా సద్గురు జగ్గీ వాసుదేవ్ తలనొప్పితో బాధపడుతున్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మహాశివరాత్రి నేపథ్యంలో ఆయన అవిశ్రాంతంగా పనిచేశారన్నారు. 17వ తేదీ ఉదయం ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు. వైద్య పరీక్షల్లో మెదడులో ప్రాణాంతకస్థాయిలో రక్తస్రావం అయినట్టు తెలిసిందన్నారు. దీంతో, శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపారు. తాము చేయగలిగింది చేసినా ఆయన సానుకూల దృక్పథం, మనోనిబ్బరంతో తనంతట తానుగా కోలుకుంటున్నారని వైద్యులు వ్యాఖ్యానించారు.

More Telugu News