Bandi Sanjay: రైతుల విషయంలో ఎన్నికల పేరుతో కాలయాపన వద్దు... మేమూ సహకరిస్తాం: బండి సంజయ్

  • కేసీఆర్ ప్రభుత్వంలా మోసం చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన
  • అప్పులు చేసి పంట వేస్తే... చేతికి వచ్చే సమయానికి నీట మునిగిందన్న బండి సంజయ్
  • రెండు లక్షల రుణమాఫీ, పంట బీమా అమలు చేయాలని డిమాండ్
Bandi Sanjay says will support in farmers issue

రైతుల విషయంలో ఎన్నికల పేరుతో కాలయాపన చేయవద్దని... రైతులను ఆదుకునే విషయంలో తామూ సహకరిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బుధవారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వంలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేయకూడదని హితవు పలికారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా రైతులనూ ఆదుకోవాలన్నారు. రైతులు అప్పులు చేసి పంటలు వేశారని.. చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాల కారణంగా నీటమునిగిందని వాపోయారు.

గత పదేళ్లలో ఒక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం అందలేదన్నారు. ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. పంటల బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల పేరుతో రైతులకు కాలయాపన చేయవద్దన్నారు. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో సిరిసిల్ల జిల్లా సహా పలు ప్రాంతాల్లో పంట నీట మునిగింది. వడగండ్ల వానకు పంట నేలపాలైంది. అకాలవర్షాలతో పంట దెబ్బతిందని, కాబట్టి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

More Telugu News