BJP: బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

  • తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కమలం కండువా కప్పుకున్న తమిళిసై
  • తిరిగి బీజేపీలో చేరడంపై వామపక్షాలు, డీఎంకే నాయకుల విమర్శలు
  • ఉన్నత పదవులు నిర్వహించి, తిరిగి ప్రజాసేవలోకి రావడం కేవలం బీజేపీలోనే సాధ్యమని అన్నామలై కౌంటర్
  • ఇతర పార్టీలలోని నాయకులు ఉన్నత పదవుల్లోనే ఎల్లకాలం కొనసాగాలనుకుంటారని విమర్శ
Tamilisai Soundararjan rejoins BJP days after quitting as Telangana Governor

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. తమిళిసై అంతకుముందు బీజేపీ నాయకురాలు. ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. ఆ తర్వాత 2019లో తెలంగాణ గవర్నర్‌గా వచ్చారు. అయితే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు ఆమె తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.

గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తిరిగి బీజేపీలో చేరడంపై వామపక్ష పార్టీలు, డీఎంకే విమర్శలు గుప్పించాయి. వారి విమర్శలకు అన్నామలై గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉన్నత పదవులలో ఉండి... పదవీ విరమణ తర్వాత సాధారణ పౌరుడిలా ప్రజాసేవలో తరించడం కేవలం బీజేపీలో మాత్రమే సాధ్యమని చురక అంటించారు. ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నత పదవులు అస్సలు వదులుకోరని... ఎందుకంటే వారికి రాజకీయాలు అంటే కేవలం ఉన్నత పదవులు మాత్రమేనని విమర్శించారు.  

తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా బాగా పని చేశారని... ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకోవడం ఆమెకు ప్రజల మీద ఉన్న ప్రేమను తెలియజేస్తోందన్నారు. అదే సమయంలో ఆమె మళ్లీ బీజేపీలో చేరడం ద్వారా పార్టీ పట్ల ఆమె నిబద్ధతను తెలియజేస్తోందన్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా అయ్యేందుకు దోహదపడాలని ఆమె భావిస్తున్నారన్నారు.

More Telugu News