Pithapuram: పవన్ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం నుంచి నేను బరిలో దిగుతా: ఎస్వీఎస్ఎన్ వర్మ

  • పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కల్యాణ్ పోటీ
  • ఎంపీగా పోటీ చేయడంపై ఆలోచిస్తున్నానన్న పవన్ 
  • చంద్రబాబుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానన్న వర్మ
SVSN Varma comments on Pithapuram issue

జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆలోచిస్తున్నట్టు పవన్ కల్యాణే స్వయంగా చెప్పారు. 

పొత్తులో భాగంగా జనసేనకు రెండు ఎంపీ సీట్లు కేటాయించగా, ఒకటి బాలశౌరికి ఖరారైంది. మరొకటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు ఖరారైంది. బాలశౌరి మచిలీపట్నం నుంచి, ఉదయ్ కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఒకవేళ ఎంపీగా పోటీ చేయాలని తనను బీజేపీ కోరితే, కాకినాడ నుంచి బరిలో దిగుతానని పవన్ అన్నారు.

ఈ నేపథ్యంలో, పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే, పిఠాపురం అసెంబ్లీ బరి నుంచి తాను పోటీ చేస్తానని వర్మ వెల్లడించారు. 

ఏదేమైనా, చంద్రబాబుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి పాటుపడతానని స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా కూటమి గెలుపు కోసం శ్రమించాలని పిఠాపురం టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

More Telugu News