heart failure: హార్ట్ ఫెయిల్యూర్ మరణాన్ని ఐదేండ్ల ముందే గుర్తించవచ్చు.. తాజా పరిశోధనలో వెల్లడి

  • బ్రిటన్ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడి
  • ఈ బృందంలో కీలకంగా భారత సంతతి ప్రొఫెసర్
  • 800 ల మందిపై పదేళ్ల పాటు స్టడీ చేశామని వివరణ
UK research explores blood test to detect heart failure risk

శరీరంలో అత్యంత కీలకమైన అవయవం గుండె.. నిర్విరామంగా పనిచేసే గుండె అకస్మాత్తుగా ఆగిపోయే ముప్పు హార్ట్ ఫెయిల్యూర్. వెంటనే తగిన చికిత్స అందకుంటే ప్రాణం దక్కదు. అయితే, అన్నిచోట్లా తగిన వైద్య సదుపాయాలు ఉండవు. దీంతో అప్పటిదాకా హాయిగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ ముప్పును ముందే గుర్తించగలిగితే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఓ పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. గుండె వైఫల్యంతో చనిపోయే ప్రమాదాన్ని ఏకంగా ఐదేళ్ల ముందే గుర్తించే పద్ధతిని బ్రిటన్ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ బృందంలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ ప్రదీప్ ఝంద్ కీలకంగా వ్యవహరించారు.

ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను గ్లాస్గో వర్సిటీ ప్రొఫెసర్ ప్రదీప్ తాజాగా వెల్లడించారు. రక్తంలో ఓ ప్రొటీన్ స్థాయులను బట్టి హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు ఎంత ఉందన్నది తెలుసుకోవచ్చని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలకు చెందిన పరిశోధకుల బృందం సంయుక్తంగా 800 మంది వాలంటీర్లపై పదేళ్ల పాటు ఈ స్టడీ నిర్వహించింది. ‘ప్రస్తుతం రక్తంలో బీ టైప్ నాట్రీయూరేటిక్ పెప్టైడ్(బీఎన్ పీ) ప్రొటీన్ స్థాయులను లెక్కించడం ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును గుర్తిస్తున్నారు. అయితే, ఎన్ పీవై ప్రొటీన్ స్థాయులను లెక్కించడం ద్వారా ఈ ముప్పును ఐదేళ్ల ముందే గుర్తించవచ్చని మా స్టడీ తేల్చింది” అని ప్రొఫెసర్ ప్రదీప్ చెప్పారు. 

ఎన్ పీవై ప్రొటీన్..
రక్తాన్ని పంప్ చేసే శక్తి తగ్గినపుడు గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.. దీనిని తట్టుకోవడానికి గుండె కండరాల్లోని నాడులు ఎన్ పీవై ప్రొటీన్ను రిలీజ్ చేస్తాయని ప్రొఫెసర్ ప్రదీప్ చెప్పారు. దీనివల్ల గుండె లయ తప్పడంతోపాటు రక్తనాళాలు కుచించుకుపోయి హార్ట్ ఫెయిల్యూర్ తో మరణించే ప్రమాదం పెరుగుతుందన్నారు. రక్త పరీక్షతో ఎన్ పీవై ప్రొటీన్ లెవల్స్ను గుర్తిస్తే.. హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును నివారించే అవకాశం ఉందని చెప్పారు.

More Telugu News