Election Commission: వాలంటీర్లపై ఈసీ కొరడా.. 30 మంది డిస్మిస్!

  • న‌లుగురు డీలర్ల‌పై వేటు
  • వైసీపీకి అనుకూలంగా ఆర్టీసీ ఉద్యోగి ప్ర‌చారం
  • మ‌రికొంతమంది ఉద్యోగుల తొల‌గింపు 
Andhra Pradesh Election Commission Dismisses 30 Volunteers

ఎన్నిక‌ల సంఘం (ఈసీ) ఆదేశాలు, ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని బేఖాత‌రు చేస్తూ వైసీపీ అనుకూల ప్ర‌చారం చేస్తున్న కొంత‌మంది  వాలంటీర్లు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని అధికారులు డిస్మ‌స్ చేశారు. వైసీపీ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నార‌ని రాష్ట్ర‌వ్యాప్తంగా మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 30 మంది వాలంటీర్ల‌ను ఉన్న‌తాధికారులు డిస్మిస్ చేశారు. అనుమ‌తి లేకుండా హెడ్‌క్వార్ట‌ర్‌ను విడిచి వెళ్ల‌కూడ‌ద‌ని ప‌లుచోట్ల ఆదేశాలిచ్చారు. అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా అంబాజీపేట మండ‌లంలో వైసీపీ శ్రేణులు నిర్వ‌హించిన సిద్ధం గ్రామ‌స్థాయి స‌భ‌లో మేమూ సిద్ధ‌మే అంటూ పాల్గొన్న 16 మంది గ్రామ వాలంటీర్ల‌ను అక్క‌డి అధికారులు డిస్మిస్ చేశారు. ఇరుసుమండ‌, మొస‌ప‌ల్లి గ్రామాల‌కు చెందిన 16 మంది వాలంటీర్లను తొల‌గించారు. 

క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి గోనెగండ్ల మండ‌లం వేముగోడు గ్రామంలో వైసీపీ నిర్వ‌హించిన మేము సిద్ధం-మా బూత్ సిద్ధం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఏడుగురు వాలంటీర్ల‌పై గ్రామ‌స్థులు అక్క‌డి ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్క‌డి అధికారులు వాలంటీర్లు బాల‌కృష్ణారెడ్డి, బాక‌ర్‌బీ, అప‌ర్ణ‌, కామాక్షి, పుష్ప‌వ‌తి, ల‌క్ష్మ‌న్న, మ‌ద్దిలేటిని విధుల నుంచి తొల‌గించారు. 

ఎమ్మిగ‌నూరు 29వ వార్డులో వైసీపీ అభ్య‌ర్థి బుట్టా రేణుక‌కు మ‌ద్ద‌తుగా ఇంటింటి ప్రచారం చేసిన ‌వాలంటీరు న‌ర‌సింహులును విధుల నుంచి తొల‌గించారు. క‌ర్నూలు 127వ వార్డు స‌చివాల‌యానికి చెందిన వాలంటీరు మ‌నోజ్‌కుమార్ కొత్త‌పేట ప్రాంతంలో వైసీపీ అనుకూల ప్ర‌చారాన్ని చేప‌ట్టిన‌ట్టు రుజువు కావ‌డంతో విధుల నుంచి త‌ప్పించారు. 

శ్రీకాకుళం జిల్లా పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మెళియాపుట్టిలో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే రెడ్డి శాంతి త‌న‌యుడు ఓంశ్రీకృష్ణ చేప‌ట్టిన ప్ర‌చారంలో పాల్గొన్న వాలంటీరు ఎం.మ‌ణికంఠ‌ను విధుల నుంచి తొలగించారు. 

వైసీపీ కోసం ఇంటింటి ప్ర‌చారం చేసి అన‌కాప‌ల్లి జిల్లా గొలుగొండ మండ‌లం కొత్త‌ మ‌ల్లంపేట స‌చివాల‌యం ప‌రిధిలోని వాలంటీర్లు బోళెం ఓంకార విజ‌య‌ల‌క్ష్మి, శింగంప‌ల్లి దుర్గాభ‌వానిని డిస్మిస్ చేశారు. తిరుప‌తి జిల్లా ఏర్పేడు మండ‌లం మ‌డిబాక‌లో శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి కుమార్తె ప‌విత్రారెడ్డి నిర్వ‌హించిన ప్ర‌చారంలో పాల్గొన్న వాలంటీర్లు ముర‌ళిని విధుల నుంచి త‌ప్పించారు. 

చిత్తూరు జిల్ల జీడీనెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని సురేంద్ర‌న‌గ‌రంలో వైసీపీ అభ్య‌ర్థి కృపాల‌క్ష్మి ప్ర‌చారంలో వాలంటీరు ర‌ఫీ పాల్గొన్నారు. దీనిపై జ‌న‌సేన నేత శోభ‌న్‌బాబు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. 

న‌లుగురు డీలర్ల‌పై వేటు
అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గంలో ఇటీవ‌ల వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి మెట్టు గోవింద‌రెడ్డి చేప‌ట్టిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న వార్డు వాలంటీరు జె. రవిని డిస్మిస్ చేశారు. ప‌ట్ట‌ణ చౌక‌ధ‌ర‌ల డిపో డీల‌ర్ల సంఘం అధ్య‌క్షుడు మేక‌ల శ్రీనివాసులు, డీల‌ర్లు వంశీకృష్ణ‌, కృష్ణ‌మూర్తి, ర‌ఫీక్ డీల‌ర్‌షిప్‌ల‌ను ర‌ద్దు చేశారు. 

వైసీపీకి అనుకూలంగా ఆర్టీసీ ఉద్యోగి ప్ర‌చారం
ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ అభ్య‌ర్థి ద‌ద్దాల నారాయ‌ణ పీసీప‌ల్లి మండ‌లంలోని నేరేడుప‌ల్లి, పోత‌వ‌రం, వ‌రిమ‌డుగు గ్రామాల్లో సోమ‌వారం రాత్రి నిర్వ‌హించిన ప్ర‌చారంలో క‌నిగిరి ఆర్టీసీ డిపో కండ‌క్ట‌ర్ ఓబుల కొండారెడ్డి పాల్గొన్నారు. ఈయ‌న వైసీపీ నాయ‌కురాలు, పీసీప‌ల్లి జ‌డ్పీటీసీ స‌భ్యురాలు ల‌క్ష్మీకాంతం భ‌ర్త‌. 

పొదిలిలో మార్కాపురం వైసీపీ అభ్య‌ర్థి అన్నా వెంక‌ట‌ రాంబాబు కుమారుడు కృష్ణ‌చైత‌న్య వెంట మ‌ల్ల‌వ‌రం విద్యుత్తు ఉప‌కేంద్రం షిప్టు ఆప‌రేట‌ర్ షేక్ గౌస్ మొహియుద్దీన్ పాల్గొని ప్ర‌చారం చేశారు. అలాగే క‌నిగిరి వైసీపీ అభ్య‌ర్థి ద‌ద్దాల నారాయ‌ణ‌తో క‌లిసి ల‌క్ష్మ‌క్క‌పల్లి స‌చివాల‌య వాలంటీరు మాచ‌ర్ల మాల్యాద్రి ప్ర‌చారం చేశారు. 

ఉద్యోగుల తొల‌గింపు
చిత్తూరు జిల్లాలో కొంద‌రు ఒప్పంద ఉద్యోగుల‌ను విధుల నుంచి తొల‌గించారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మించి వైసీపీ ప్ర‌చారాల్లో పాల్గొన్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని గుడుప‌ల్లె మండ‌లం చీక‌టిప‌ల్లి ఉపాధి హామీ క్షేత్ర స‌హాయ‌కుడు వెంక‌టేష్‌, కుప్పం మండ‌లం సాంకేతిక స‌హాయ‌కుడు మురుగేష్‌ను విధుల నుంచి తొల‌గించారు.

More Telugu News