Tangella Uday Srinivas: ఎవరీ తంగెళ్ల ఉదయ్... జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ

  • కాకినాడ ఎంపీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిని ప్రకటించిన పవన్
  • తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన కాకినాడ అభ్యర్థి అని వెల్లడి
  • గతంలో పలు ఐటీ కంపెనీల్లో పనిచేసిన ఉదయ్
  • దుబాయ్ లో ఉద్యోగం మానేసి వచ్చి 'టీ టైమ్' కంపెనీతో రాణిస్తున్న వైనం
Who is Tangella Uday

జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం తెలిసిందే. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంటు స్థానంలో జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ఎవరీ ఉదయ్ శ్రీనివాస్? అంటూ అందరిలోనూ చర్చ మొదలైంది. 

ఉదయ్ గురించి విశేషాలు చూస్తే మనోడు సామాన్యుడు కాదు అనే రేంజిలో ఉన్నాయి. దుబాయ్ లో కళ్లు చెదిరే జీతంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేసి, భారత్ వచ్చి 'టీ టైమ్' పేరిట దేశవ్యాప్తంగా టీ షాపుల చెయిన్ ప్రారంభించి, కోట్ల రూపాయల టర్నోవర్ తో యువ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందాడు. 

ఉదయ్ 2006లో హైదరాబాదులోని టీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత పలు ఐటీ సంస్థల్లో పనిచేశాడు. చివరిసారిగా దుబాయ్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఖరీదైన జాగ్వార్ కారు, లగ్జరీ విల్లా... ఇలా అక్కడ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు. 

అయితే, 29 ఏళ్ల వయసులో సొంతంగా ఏదైనా సాధించాలన్న తపనతో ఉద్యోగం వదిలేశాడు. లక్షల్లో వేతనం అందుకుంటున్న దశలో ఒక్కసారిగా ఉద్యోగం మానేయడంతో అతడి కుటుంబం ఏమాత్రం హర్షించలేకపోయింది. భారత్ వచ్చిన అనంతరం టీ టైమ్ పేరిట దేశవ్యాప్త గొలుసుకట్టు టీ దుకాణాలతో కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. 

ఆ సమయంలో ఉదయ్ కు సపోర్ట్  గా నిలిచింది భార్య బకుల్ ఒక్కరే. ఆమె ఓ ఆయుర్వేదిక్ డాక్టర్. భార్య ప్రోత్సాహంతో వ్యాపార రంగంలోకి దిగిన ఉదయ్ అనుకున్నది సాధించారు.

 టీ టైమ్ ఐడియా వర్కౌట్ కావడంతో ఉదయ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. 2016లో రూ.5 లక్షల పెట్టుబడితో రాజమండ్రిలో తొలి టీ దుకాణం స్థాపించగా... ఇప్పుడు టీ టైమ్ ఫ్రాంచైజీల సంఖ్య 3 వేలకు పెరిగింది. టీ టైమ్ ప్రైవేట్ లిమిటెడ్ టర్నోవర్ రూ.35 కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు. 

రాజకీయాలు, ప్రజాసేవపై ఆసక్తితో ఉదయ్ శ్రీనివాస్ ఏపీ వైపు దృష్టి  సారించాడు. తన ఆలోచనలకు అనువుగా కనిపించిన పార్టీ జనసేన అని గుర్తించాడు. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చడంతో ఇంకేమీ ఆలోచించకుండా జనసేన పార్టీలో చేరాడు. పవన్ కూడా ఉదయ్ ఆలోచనలను ప్రోత్సహించే క్రమంలో కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు.

More Telugu News