Shabbir Ali: 14 లోక్ సభ సీట్లు తప్పకుండా గెలుస్తాం: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

  • హైదరాబాద్‌లో ఆశించిన సీట్లు గెలుచుకోలేదు.. అందుకే 65కి పరిమితమయ్యాయన్న షబ్బీర్ అలీ
  • 100 రోజుల్లోనే ఆరింట 5 గ్యారెంటీలు అమలు చేశామని వెల్లడి
  • కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుతో చిప్ప చేతికి ఇచ్చారని విమర్శ
Shabbir Ali says congress will win 14 seats in telangana

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 14 లోక్ సభ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఎన్టీవీ 'ఫేస్ టు ఫేస్' కార్యక్రమంలో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో ఆశించిన సీట్లు గెలుచుకోలేదని అందుకే కాంగ్రెస్ స్థానాలు 65కు పరిమితం అయినట్లు చెప్పారు. ఆరు గ్యారెంటీలు సహా ఇవ్వని హామీలను కూడా తాము అమలు చేస్తున్నామన్నారు. 100 రోజుల్లో ఆరింట ఐదు గ్యారెంటీలు అమలు చేయడం సాధారణ విషయం కాదన్నారు. కానీ కేసీఆర్ పదేళ్ల కాలంలో ఆయన చెప్పిన వాటిలో 10 శాతం కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. పైగా 4 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయన్నారు.

తమకు కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుతో చిప్ప చేతికి ఇచ్చారని మండిపడ్డారు. అయినప్పటికీ పథకాల విషయంలో కేసీఆర్‌లా తాము మోసం చేయబోమని... ఆర్థిక పరిస్థితి బాగాలేదని... ఇప్పటికే ఐదు గ్యారెంటీలు అమలు చేశామన్నారు. మిగతా వాటిని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాలేదు... అప్పుడే విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. అలా విమర్శించే వారికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ అవినీతిపై పూర్తి నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేడిగడ్డపై పకడ్బందీగా విచారణ జరిపిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ తమను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ పదేళ్లపాటు అధికారంలో ఉండి ఏమీ చేయలేదని... కానీ తాము అన్ని నివేదికల తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.

More Telugu News