BRS: తెలంగాణలో 30,000 ఉద్యోగాలు ఇచ్చామన్న ఢిల్లీ కాంగ్రెస్ నేతలు... 'ఫ్యాక్ట్ చెక్' పేరుతో బీఆర్ఎస్ కౌంటర్

  • కాంగ్రెస్ 3 నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిందన్న కేసీ వేణుగోపాల్
  • తమ హయాంలో ఇస్తే కాంగ్రెస్ క్రెడిట్ తీసుకుంటోందని బీఆర్ఎస్ ట్వీట్
  • నోటిఫికేషన్ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ వరకు కేసీఆర్ హయాంలో పూర్తయిందన్న బీఆర్ఎస్
  • ఎన్నికల కోడ్ కారణంగా నియామకపత్రాలు ఇవ్వలేకపోయినట్లు వెల్లడి
  • కేవలం నియామక పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటోందని బీఆర్ఎస్ కౌంటర్
Congress is blatantly claiming credit for the work done by the BRS

తెలంగాణలో ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో చెప్పడంపై బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. తమ హయాంలో వచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడం ద్వారా క్రెడిట్ కొట్టేసే ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ పేర్కొంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలను ట్వీట్ చేస్తూ... ఫ్యాక్ట్ చెక్ పేరుతో కౌంటర్ ఇచ్చింది.

తెలంగాణలో మూడు నెలల కాంగ్రెస్ పాలనలోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని... తాము ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగాలేనని కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ రీట్వీట్ చేస్తూ తమ హయాంలో వచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ సిగ్గులేకుండా తాము ఇచ్చినట్లు చెప్పుకుంటోందని మండిపడింది. వాస్తవం కాంగ్రెస్ నేతలు చెప్పిన దానికి భిన్నంగా ఉందని పేర్కొంది.

మొత్తం 30,000 ఉద్యోగ నోటిఫికేషన్‌లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జారీ చేశామని... కేసీఆర్ ప్రభుత్వమే నోటిఫికేషన్‌లను జారీ చేసిందని... ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ క్లియరెన్స్ కూడా పొందిందని... పరీక్షలు నిర్వహించింది... మొత్తం 30,000 ప్రభుత్వ ఉద్యోగాల కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ను పూర్తి చేసింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే అని పేర్కొంది. అయితే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వలేకపోయిందని... ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ క్రెడిట్ తాను తీసుకుంటోందని పేర్కొంది.

More Telugu News