Election Code: ఎన్నికల్ కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఏం చేయవచ్చు? ఏం చేయకూడదు?... వివరాలు ఇవిగో!

  • ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • అదే రోజు నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు
  • నేడు ఏపీ సీఎస్ జవహరెడ్డి కీలక సమావేశం
  • హాజరైన ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా, వివిధ శాఖల ఉన్నతాధికారులు
AP CS held meeting on election code

కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 16న షెడ్యూల్ విడుదల చేసింది. ఆ రోజు నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుండగా, ఎన్నికల కోడ్ పై రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా, వివిధ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై ఈ సమావేశంలో చర్చించారు.

అధికారులకు సీఎస్ ఆదేశాలు ఇవే...

  • ఎన్నికల కోడ్ పై కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తు.చ తప్పకుండా అమలు చేయాలి
  • కార్యదర్శి స్థాయి అధికారులు ఎన్నికల కోడ్ మార్గదర్శకాలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. కోడ్ సూత్రాలపై సీఈవో ఫార్మాట్ లో అవగాహన పెంచుకోవాలి
  • ప్రభుత్వ వెబ్ సైట్లలో ప్రజాప్రతినిధుల ఫొటోలు, వీడియోలు, ఆడియోలు వెంటనే తొలగించాలి.
  • గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫొటోలు, ఫ్లెక్సీలు తొలగించాలి
  • ప్రభుత్వ ఆస్తులపై రాజకీయ ప్రకటనలను తొలగించాలి
  • ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొంటే వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి

సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ఏం చెప్పారంటే...

  • ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కొత్త పథకాలు ప్రకటించడానికి వీల్లేదు
  • బడ్జెట్ ప్రొవిజన్ ఉన్నా... కొత్త పథకాలు, ప్రాజెక్టులు, నిధులు, రాయితీలు, శంకుస్థాపనలు, హామీలు ఇవ్వడంపై పూర్తి నిషేధం ఉంటుంది
  • వర్క్ ఆర్డర్ ఉన్న పనుల విషయంలో ఇంకా పనులు ప్రారంభం కాకపోతే, అక్కడ ఎలాంటి పనులు చేపట్టరాదు
  • పనులు పూర్తయిన వాటికి నిధుల విడుదల చేసుకోవచ్చు... దీనిపై నిషేధం లేదు
  • కోడ్ అమలులో ఉన్నందున... ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించరాదు
  • జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు ఎన్నికల కోడ్ అడ్డు రాదు
  • కోడ్ అమల్లోకి రాకముందే ఏవైనా పనులకు టెండర్లు పిలిస్తే ఆ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లవచ్చు... కానీ టెండర్లు ఖరారు చేయరాదు
  • ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోపు... ప్రభుత్వ ఆస్తులపై ఉన్న వాల్ రైటింగ్స్, పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లుల, ఫ్లెక్సీలు, జెండాలు, హోర్డింగులు తొలగించాలి
  • కోడ్ అమల్లోకి వచ్చిన 48 గంటల్లోపు... బహిరంగ ప్రదేశాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు. ప్రభుత్వ బస్సులు, రైల్వే వంతెనలు, రహదారి వంతెనలు, మున్సిపల్ ఆడిటోరియంలు, విద్యుత్ స్తంభాలపై ఎలాంటి రాజకీయ ప్రకటనలు, వాల్ రైటింగులు, కటౌట్లు, పోస్టర్లు తొలగించాలి
  • ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ నిధులతో జారీ చేసే ప్రకటనలు నిలిపివేయాలి
  • ఎన్నికల ప్రకటన వచ్చాక... మంత్రులు అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు
  • ఎంపీ లాడ్స్, ఎమ్మెల్యే నిధులు, ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులపై ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు, ఇతర ప్రజాప్రతినిధుల ఫొటోలు ఉండరాదు
  • ఎన్నికల ప్రకటన వచ్చాక... ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు ఫొటోలు తొలగించాలి
  • ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక... వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు, బోర్డింగ్ పాస్ లు, వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు, సందేశాలు ఉండరాదు
  • పీఎం కేర్, సీఎం రిలీఫ్ ఫండ్ కింద అత్యవసర చికిత్సలకు నిధుల మంజూరుకు ఎలాంటి అభ్యంతరం లేదు
  • గాంధీ జయంతి, సద్భావనా దివస్ వంటి జాతీయ ప్రాముఖ్యత ఉన్న వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనవచ్చు... కానీ రాజకీయ ప్రసంగాలు చేయరాదు
  • ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం, ప్రచారం చేయడం నిషిద్ధం
  • ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించినా, ప్రచారం చేసినా, ఆయా పార్టీల నుంచి ఏవైనా కానుకలు, ప్రయోజనాలు పొందితే వారిపై వివిధ చట్టాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు ఉంటాయి

More Telugu News