Male Breast Cancer: పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్.. ఈ లక్షలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు

  • ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ రొమ్ము కేన్సర్ బాధితులు
  • 2022లో ప్రపంచవ్యాప్తంగా 6.70 లక్షల మందికి బ్రెస్ట్ కేన్సర్
  • 157 దేశాల్లో రొమ్ముకేన్సర్ సర్వసాధారణం
  • రొమ్ము కేన్సర్ బారినపడుతున్న ఒకశాతం పురుషులు
  • పుట్టినప్పుడు స్త్రీ,పురుషుల్లో ఒకే రకంగా రొమ్ము నాళాలు
Key Facts About Male Breast Cancer Do You Know This

రొమ్ము కేన్సర్ అనగానే అదేదో మహిళలకు మాత్రమే వచ్చేదని అందరూ భావిస్తుంటారు. అయితే, ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు. రొమ్ము కేన్సర్ అనేది ఇటీవల పురుషుల్లోనూ ఎక్కువగా బయటపడుతోంది. ఎంతలా అంటే.. 0.5 నుంచి ఒకశాతం వరకు పురషులు కూడా దీని బారినపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజా గణాంకాలు చెబుతున్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా 6.70 లక్షల మంది రొమ్ము క్యాన్సర్ బారినపడ్డారు.  185 దేశాల్లోని 157 దేశాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. అంటే దాదాపు ప్రతిదేశంలోనూ ఇది వేళ్లూనుకున్నట్టే లెక్క.

అసలేంటీ రొమ్ము కేన్సర్?
రొమ్ము కణాలు నియంత్రణ లేకుండా పెరగడం వల్ల రొమ్ములో కణతులు ఏర్పడతాయి. వీటిని ఇలాగే వదిలేస్తే ఆపై అవి శరీరమంతా పాకి ప్రాణాంతకంగా మారతాయి. బ్రెస్ట్ కేన్సర్ కణాలు పాల నాళాలు, లేదంటే పాలను ఉత్పత్తి చేసే లోబుల్స్ (చిన్నకణజాలం లాంటిది)లో పెరుగుతాయి. ఆ తర్వాత అవి రొమ్ము కణజాలంలోకి చేరుకుని కణతులు ఏర్పరుస్తాయి. దీనికి చికిత్స అనేది ఆయా వ్యక్తుల శరీరతత్వం, కేన్సర్ రకం వంటివాటిపై ఆధారపడి ఉంటుంది. శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ వంటివాటి ద్వారా దీనికి అడ్డుకట్ట వేయవచ్చు. 

పురుషుల్లోనూ అంతే..
రొమ్ము కేన్సర్ ఏర్పడడానికి మహిళల్లో ఏవైతే కారణమవుతాయో, లేదంటే ఎలా ఏర్పడతాయో.. పురుషుల్లోనూ ఇంచుమించుగా అవే కారణాలు మారుతాయి.. కేన్సర్ కణాలు అలాగే పురుడుపోసుకుంటాయి. ఎందుకంటే పుట్టినప్పుడు స్త్రీపురుషుల్లో రొమ్ము నాళాలు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి బ్రెస్ట్ కేన్సర్ ఇద్దరికీ సోకే అవకాశం ఉంది. అయినప్పటికీ మహిళలే ఎక్కువగా దీని బారినపడుతున్నారు. పురుషుల్లో రొమ్ము కేన్సర్ అరుదే అయినప్పటికీ ఇటీవలి కాలంలో ఎక్కువమంది దాని బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఇది పెద్ద వయసులో వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ ఏ వయసులోనైనా ఇది సంక్రమించగలదు.  

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
సాధారణంగా బ్రెస్ట్ కేన్సర్ లక్షణాలను ప్రాథమిక దశలో గుర్తించడం కష్టం. అది ముదురుతున్న సమయంలో బయటపడుతుంది. నొప్పి లేకుండానే రొమ్ము తరచూ గట్టిపడడం, రొమ్ము పరిమాణం, ఆకారం మారుతుండడం, చనుమొనలు ఎరుపురంగంలోకి మారడం, చర్మంపై ఇతర మార్పులు, చనుమొన నుంచి అసాధారణమైన, లేదంటే రక్తం స్రవిస్తుండడం, రొమ్ము గట్టిగా అనిపించినా నొప్పి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీచేసింది.

More Telugu News