Elon Musk: డ్రగ్స్ వాడుతున్నట్టు అంగీకరించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్

  • డిప్రెషన్ నుంచి బయటపడడానికి కెటామైన్‌ను వాడుతున్నానని వెల్లడించిన టెస్లా అధినేత
  • వైద్యుల సూచన మేరకు తక్కువ మోతాదులో వాడుతున్నానని వెల్లడి
  • ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్న మస్క్
Elon Musk says he is using drug ketamine

ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ల అధినేత ఎలాన్ మస్క్ డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అంగీకరించారు. కెటామైన్‌ను వాడుతున్నానని, టెస్లా కంపెనీ నిర్వహణలో డ్రగ్స్ వినియోగం తనకు ఉపయోగపడుతోందని ఆయన వెల్లడించారు. ఇటీవల డాన్ లెమన్‌ అనే ప్రముఖ జర్నలిస్టుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని మస్క్ ఒప్పుకున్నారు. డిప్రెషన్ వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటున్నానని, అలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి డ్రగ్‌ని ఉపయోగిస్తున్నానని మస్క్ తెలిపారు.

మెడికేషన్‌లో భాగంగా కెటామైన్ వాడుతున్నానని, ఒక వైద్యుడి సూచన మేరకు వారానికి ఒకసారి కొద్ది మొత్తంలో తీసుకుంటానని మస్క్ వివరించారు. డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఉందని వివరించారు. కెటామైన్‌ను ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే పనిని పూర్తి చేయలేరని, తనకు చాలా పని ఉంటుందని మస్క్ అన్నారు. రోజులో 16 గంటలపాటు పని చేస్తుంటానని అన్నారు. మానసిక స్థితిపై ఎక్కువ సమయం ప్రభావం చూపే డ్రగ్స్ వాడకూడదని ఆయన సూచించారు.

కాగా ఎలాన్ మస్క్ డ్రగ్స్ వాడతారంటూ కొన్ని వారాలక్రితం వార్తలు వచ్చాయి. అతడి డ్రగ్స్ వాడకం పట్ల టెస్లా కంపెనీలోని పలువురు బోర్డు సభ్యులు ఆందోళన చెందుతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. మస్క్ ఆరోగ్యంపై, కంపెనీ పర్యవేక్షణపై దుష్ప్రభావం చూపవచ్చని కథనాలు పేర్కొన్న విషయం తెలిసిందే.

More Telugu News