SIB Praneeth: ఎస్ఐబీ హార్డ్ డిస్క్ లను అడవిలో పడేశా: ప్రణీత్ రావు

SIB Former Dsp Praneeth Questioned by Banjara Hills Police On Second Day
  • కట్టర్లతో కత్తిరించి ధ్వంసం చేశానన్న మాజీ డీఎస్పీ
  • రెండో రోజు విచారణలో కీలక విషయాల వెల్లడి
  • ప్రణీత్ తో కలిసి పనిచేసిన వారినీ విచారిస్తున్న అధికారులు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం రెండో రోజు విచారణలో ప్రణీత్ పలు కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. ఎస్ఐబీకి చెందిన పలు హార్డ్ డిస్క్ లను కట్టర్లతో కత్తిరించి, వాటిని అడవిలో పడేసినట్లు ప్రణీత్ చెప్పాడట. దీంతో ప్రణీత్ ను వికారాబాద్ అడవిలోకి తీసుకెళ్లి హార్డ్ డిస్క్ శకలాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చంచల్ గూడ జైలులో ఉంటున్న ప్రణీత్ ను కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రణీత్ ను ఓ ఏసీపీ సహా మరో ఇద్దరు అధికారులతో కూడిన బృందం ప్రత్యేకంగా ప్రశ్నిస్తోందని తెలుస్తోంది.

కేసు ప్రాధాన్యం దృష్ట్యా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేవలం ఫిర్యాదుదారులు మినహా ఇతరులను స్టేషన్ లోకి అనుమతించడంలేదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విచారించారు. హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలోనే విచారణ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపైనే అధికారులు పలు ప్రశ్నలు సంధించి, ప్రణీత్ నుంచి జవాబులు రాబట్టారట. ప్రణీత్ తో పాటు ఆయనతో కలిసి పనిచేసిన అధికారులనూ ఈ బృందం విచారణకు పిలిపిస్తోంది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సీఐగా విధులు నిర్వహిస్తున్న ప్రణీత్ మాజీ కొలీగ్ ను సోమవారం విచారించినట్లు అనధికారిక వర్గాలు వెల్లడించాయి. మరికొందరిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
SIB Praneeth
Hard disks
Phone Tapping
Banjara Hills
Police
Investigation

More Telugu News