IPL 2024: ఐపీఎల్ ఆరంభానికి 3 రోజుల ముందు ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్

Luke Wood named replacement to Mumbai Indians as star pacer ruled out of IPL 2024
  • గాయం కారణంగా టోర్నీకి దూరమైన స్టార్ పేసర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్
  • అతడి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ ల్యూక్‌ను జట్టులోకి తీసుకున్న ముంబై ఇండియన్స్
  • అంతర్జాతీయ క్రికెట్‌లో తక్కువ అనుభవమే ఉన్నా.. దేశవాళీ లీగ్‌లలో ఉడ్‌కు చక్కటి రికార్డు
ఐపీఎల్ 2024 ఎడిషన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ పేసర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ టోర్నీకి దూరమయ్యాడని ఆ జట్టు ప్రకటించింది. అతడి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ ల్యూక్ ఉడ్‌ను టీమ్‌లోకి తీసుకున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ముంబై ఇండియన్స్ సోమవారం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఉడ్ ఎడమచేతి వాటం పేసర్ అని, ఇంగ్లండ్ తరపున 2 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాడని, టీ20ల్లో 8 వికెట్లు తీశాడని ముంబై ఇండియన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉడ్ ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసినట్టు వివరించింది.

ల్యూక్ ఉడ్ ఇంగ్లండ్ తరపున 5 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ దేశీవాళీ, టీ20 ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో అద్భుతమైన గణాంకాలను కలిగివున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన ఉడ్ ప్రస్తుతం ‘పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024’లో ఆడుతున్నాడు. బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పెషావర్ జల్మీ ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. ఈ ఏడాది 11 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు. ఇదిలావుంచితే గతేడాది స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ అందుబాటులో లేకపోయినప్పటికీ బెహ్రెన్‌డార్ఫ్ పేస్ బౌలింగ్‌ దళాన్ని ముందుండి నడిపించాడు. గత ఎడిషన్‌లో అతడు 12 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు.

మార్పులు, చేర్పుల తర్వాత ముంబై ఇండియన్స్ జట్టుని పరిశీలిస్తే.. హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, నెహాల్ వధేరా, షమ్స్ ములానీ, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షన్ మదుశంక, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, అన్షుల్ కాంబోజ్, నమన్ ధీర్, మొహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ, ల్యూక్ ఉడ్ జట్టులో ఉన్నారు.
IPL 2024
Mumbai Indians
Jason Behrendorff
Luke Wood

More Telugu News