Sajjala Ramakrishna Reddy: కాంగ్రెస్, వైసీపీ ఒక్కటేనని ప్రధాని మోదీ చెప్పగానే జనం నమ్ముతారా?: సజ్జల

  • నిన్న చిలకలూరిపేటలో మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన సజ్జల
  • నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ కాంగ్రెస్ అని వెల్లడి
  • ఆ పార్టీ గురించి తాము పట్టించుకోబోమని స్పష్టీకరణ
  • సభ జరుపుకోవడం చేతకాక పోలీసులపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా
Sajjala reacts on PM Modi remarks in Chilakaluripet rally yesterday

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద నిన్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరైన ప్రజాగళం సభపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. 

పొత్తు కోసం వెంపర్లాడేది వీళ్లే... ఆ తర్వాత విడిపోయేదీ వీళ్లే... వీళ్లకు ఇదే పని అంటూ ఎద్దేవా చేశారు. 2014లో ఒకసారి కలిశారు... మళ్లీ ఇప్పుడు 2024లో కలిశారు... ఏ ముఖం పెట్టుకుని ముగ్గురూ ఒక వేదికపైకి వచ్చారు? అని ప్రశ్నించారు. ఆనాడు విడాకులు తీసుకుని ఒకరినొకరు తిట్టుకున్నారు... ముఖ్యంగా ప్రధాని మోదీని చంద్రబాబు నోటికొచ్చినట్టు తిట్టారు... మళ్లీ ఇప్పుడెందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పగలరా? అని సజ్జల నిలదీశారు. 

"పదేళ్ల తర్వాత మళ్లీ అదే డ్రామా మొదలుపెట్టారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేదు కానీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. సభ జరుపుకోవడం చేతకాక పోలీసులపై విమర్శలు చేస్తున్నారు. కనీసం ఒక చిన్న సభ నిర్వహించడం చేతకాకపోతే రాష్ట్రానికి ఏం చేయగలరు?" అంటూ సజ్జల ధ్వజమెత్తారు. సభ అంటూ పిలిచి ప్రధానిని అవమానించారని విమర్శించారు. 

ఇక, ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటేనని, ఆ రెండు పార్టీల నాయకత్వాలు ఒక కుటుంబం నుంచే వచ్చాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సజ్జల ఖండించారు. కాంగ్రెస్, వైసీపీ ఒక్కటేనని ప్రధాని మోదీ చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పార్టీ నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన పార్టీ అని, ఆ పార్టీ గురించి తాము ఆలోచించబోమని స్పష్టం చేశారు. అర్జంటుగా అధికారంలోకి రావాలన్నదే కూటమి నేతల ప్రయత్నమని వ్యంగ్యం ప్రదర్శించారు. అందుకే సీఎం జగన్ ను అదే పనిగా విమర్శిస్తున్నారని సజ్జల మండిపడ్డారు.

More Telugu News