Congress: కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేతలు అనడం దారుణం: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ప్రధాని మోదీ తరం కాదని వ్యాఖ్య
  • ప్రభుత్వాలను కూలగొట్టడమే బీజేపీ లక్ష్యంగా చేసుకుందని విమర్శ
  • ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు ముందుకు వచ్చినా తాము చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్య
Rammohan Reddy faults bjp leaders comments in jagityal public meeting

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేతలు జగిత్యాల సభలో మాట్లాడటం దుర్మార్గమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ప్రధాని నరేంద్ర మోదీ తరం కాదన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల తర్వాత ఉండదని ప్రధాని మోదీ, ఇతర నేతలు అనడం సరికాదన్నారు. ప్రభుత్వాలను కూలగొట్టడమే బీజేపీ లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు.

తమ పార్టీలో చేరడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు ముందుకు వచ్చినా తాము చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరితే ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతల తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ పార్టీదన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయిదేళ్లు ఎలా కొనసాగించాలో తమకు తెలుసునన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తారన్నారు.

More Telugu News