RS Praveen Kumar: బీఆర్ఎస్‌తో పొత్తు రద్దు చేసుకోవాలని మాయావతి నాపై ఒత్తిడి తెచ్చారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar hot comments on mayawati
  • కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్
  • జై బీమ్... జై తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ పార్టీతో పొత్తును రద్దు చేసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి తనపై ఒత్తిడి తెచ్చారని అందుకే ఆ పార్టీని వీడినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన సోమవారం సాయంత్రం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జై బీమ్... జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేశారని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి బలమైన పునాది వేశారన్నారు. మనకు అవకాశమిచ్చి తెలంగాణలో కేసీఆర్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు.

కేసీఆర్ లాగే తాను కూడా మాట ఇస్తే తప్పనన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తెలిపారు. బలమైన తెలంగాణ వాదానికి బహుజన వాదం కలిస్తే బాగుంటుందని లోక్ సభ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్‌తో పొత్తు రద్దు చేసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. అయితే, ఇది తనకు ఇష్టం లేదని, అందుకే బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు పలువురు బీఎస్పీ నాయ‌కులు, మ‌ద్ద‌తుదారులు, అభిమానులు భారీ సంఖ్య‌లో గులాబీ కండువా కప్పుకున్నారు.
RS Praveen Kumar
KCR
Telangana
Mayawati

More Telugu News