KCR House Water Crisis: కేసీఆర్ నివాసానికి ఫ్రీగా వాటర్ ట్యాంకర్ పంపిన జలమండలి

  • నీటి కొరత నేపథ్యంలో జలమండలి ఆఫీసుకు ఫోన్ 
  • వెంటనే 5 వేల లీటర్ల ట్యాంకర్ పంపిన అధికారులు
  • పెద్ద సంఖ్యలో నేతలు ఇంటికి రావడంతో నీటి కొరత
Jalamandali Sent Water Tanker To KCR Nandinagar House

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం నందినగర్ లోని తన నివాసంలో ఉంటున్న విషయం తెలిసిందే. సోమవారం కేసీఆర్ ఇంట్లో నీటికి కొరత ఏర్పడింది. దీంతో వ్యక్తిగత సిబ్బంది జలమండలికి ఫోన్ చేయడంతో అధికారులు వెంటనే వాటర్ ట్యాంకర్ పంపించారు. 5 వేల లీటర్ల ట్యాంకర్ ను కేసీఆర్ నివాసానికి ఉచితంగా పంపించినట్లు జలమండలి మేనేజర్ రాంబాబు తెలిపారు. అయితే, బంజారాహిల్స్ నందినగర్ లో నీటి కొరత లేదని చెప్పారు. కేసీఆర్ నివాసానికి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు రావడంతో తాత్కాలికంగా కొరత ఏర్పడిందని వివరించారు. కాగా, నందినగర్‌ దిగువన ఉన్న వెంకటేశ్వరనగర్‌ ప్రాంతంలో కొంత అంతరాయం కలుగుతుందని స్థానికులు తెలిపారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో సోమవారం నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వచ్చారు. దీంతో ఇంట్లో నీటికి కొరత ఏర్పడిందని కేసీఆర్ ఇంటి వ్యవహారాలు చూసే సిబ్బంది చెప్పారు. దీంతో జలమండలి తట్టిఖాన సెక్షన్‌ కార్యాలయానికి ఫోన్‌ చేసి మంచినీరు కావాలని కోరినట్లు తెలిపారు. కాగా, కేసీఆర్ ఇంటికి వాటర్ ట్యాంకర్ వెళ్లిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది.

More Telugu News